హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లలో 8వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేబినెట్‌కు పంపించనున్నది. ఫీజుల నియంత్రణపై మరోసారి భేటీ కానున్నట్టు ప్రకటించింది. సీఎం కేసీఆర్ తో చర్చించి, వీటికి సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించాలని నిర్ణయించింది. సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు చేపట్టాల్సిన విధివిధానాలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై సర్కారు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగింది. మీటింగ్‌లో మంత్రులు కేటీఆర్, హారీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఇంగ్లీష్ మీడియం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంగ్లీష్ మీడియంలో చేరే స్టూడెంట్లకు ఉపయోగపడేలా రెండు భాషల్లో పాఠ్యపుస్తకాలను ప్రింట్ చేయాలని సూచించారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్పేందుకు వీలుగా టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. స్టూడెంట్లకు ఇంగ్లిష్ లో టెక్నిక్స్ నేర్పేందుకు అవసరమైతే టీ-సాట్ ద్వారా ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఈ విషయంలో మరోసారి సమావేశమై, తుది నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడింది. సమావేశంలో సందీప్ కుమార్ సుల్తానియా, క్రిస్టీనా జడ్‌చోంగ్తు, దివ్య, ఉమర్ జలీల్, శ్రీదేవసేన పాల్గొన్నారు.