5 ఎకరాలా.. 10 ఎకరాలా? : రైతు భరోసా కటాఫ్‪పై కేబినెట్ సబ్ కమిటీ చర్చ

5 ఎకరాలా.. 10 ఎకరాలా? : రైతు భరోసా కటాఫ్‪పై కేబినెట్ సబ్ కమిటీ చర్చ
  • సాగులో లేని భూములకు ఇవ్వొద్దని నిర్ణయం
  • ఈ నెల 11 నుంచి రైతుల అభిప్రాయాల సేకరణ
  • 16వ తేదీ తర్వాత మరోసారి భేటీ కానున్న సబ్ కమిటీ
  • కౌలు రైతుల గుర్తింపుపై అధికారుల నుంచి సూచనలు

హైదరాబాద్, వెలుగు : రైతు భరోసా కటాఫ్​పై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. స్కీమ్​ విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సెక్రటేరియెట్​లో శుక్రవారం భేటీ అయింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ ఐదు ఎకరాల వరకే రైతుభరోసా ఇవ్వాలా? లేదంటే పది ఎకరాల వరకు ఇవ్వాలా? అనే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్​గా చర్చించింది. 

ఇప్పటి దాకా రైతుబంధు పొందుతున్న వారిలో 83 శాతం మంది 5 ఎకరాల్లోపు రైతులేనని, దీంతో 5 ఎకరాలకు కటాఫ్​ పెడ్తే మెజారిటీ రైతులు కవర్​అవుతారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఇటీవల రైతునేస్తం కార్యక్రమం ద్వారా 50వేల మంది రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించగా, అందులో మెజారిటీ రైతులు, రైతుసంఘాల నేతలు పది ఎకరాలకు కటాఫ్ పెడ్తే బాగుంటుందని చెప్పిన విషయం మీటింగ్​లో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ నెల 11 నుంచి 16 వరకు జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో మరోసారి రైతుల అభిప్రాయాలు తీసుకొని 16 తర్వాత సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు.

కౌలురైతుల గుర్తింపు ఎలా..

భేటీలో కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది. భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతులే తీవ్ర నష్టాలపాలవుతున్నందున వారికే రైతుభరోసా అవసరం ఎక్కువని, వారిని గుర్తించేందుకు విధివిధానాలను రూపొందించాలని సబ్​కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే వ్యవసాయ, రెవెన్యూ శాఖల వద్ద భూ యజమానులైన రైతుల డేటా ఉండడంతో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా రైతుబంధు ఇస్తూ వచ్చారు. కానీ కౌలు రైతులను గుర్తించడం అంత ఈజీ కాదని భావిస్తున్నారు. యజమానులతో అగ్రిమెంట్​రాయించుకున్న కౌలు రైతులకు ఆ రికార్డుల ఆధారంగా రైతుభరోసా ఇవ్వాలా? లేదంటే పంట అమ్ముకునే సందర్భంలో ఇవ్వాలా? అనే దానిపై అధికారుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు.

దుబారా తగ్గించడం ఎలా? 

గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరానికి రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వానాకాలం నుంచి ఎకరానికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగుచేయని భూములు, వెంచర్లు, రోడ్లు, గుట్టలకు రైతుబంధు ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. అలాగే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రైతుబంధు కింద లక్షలు ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. 

ఈ నేపథ్యంలో దుబారాను తగ్గించి అర్హులైన పేద సన్నకారు రైతులకు మాత్రమే రైతుభరోసా ఇచ్చేలా విధివిధానాలు రూపొందించాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది. సాగులో లేని భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుభరోసా ఇవ్వవద్దని, అలాగే ప్రజాప్రతినిధులు, ఇన్​కంటాక్స్ పేయర్స్​ను కూడా పక్కన పెట్టాలనే అంశంపైనా సబ్​కమిటీ చర్చించినట్లు తెలిసింది.