మిల్లర్లు సహకరించని చోట్ల..గోదాముల్లో ధాన్యం నిల్వ చేయండి

  • అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
  • ధాన్యం కొనుగోళ్లపై కేబినెట్ సబ్ ​కమిటీ రివ్యూ

హైదరాబాద్, వెలుగు : మిల్లర్లు సహకరించని ప్రాం తాల్లో ధాన్యాన్ని ఇంటర్మీడియెట్ గోదాముల్లో నిల్వ చేయాలని అధికారులను సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ ​కుమార్​రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఉత్త మ్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్​కమిటీ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించింది. డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, శ్రీధర్ ​బాబుతో పాటు సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్, అధికారులు, మిల్లర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

ధాన్యం నిల్వ చేసేందుకు వేర్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల టన్నుల కెపాసిటీతో గోదాములను సిద్ధం చేసినట్లు ఉత్తమ్​ చెప్పారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా అవసరమైతే మరింత స్టోరేజీని సిద్ధం చేయాలని, ఆ తరువాత సీఎంఆర్ ఇవ్వాలన్నారు. పలు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడు రికార్డు స్థాయిలో 1.50 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని, అదేవిధంగా రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు. 

ప్రభుత్వ హామీ మేరకు మిల్లింగ్ ఇండస్ట్రీని ఆదుకుంటుందని మిల్లర్లు సహకరించాలని కోరారు. సీఎంఆర్​కు పక్క రాష్ట్రం ఏపీలో బ్యాంక్​ గ్యారెంటీనీ100 శాతం ఇవ్వాలని షరతు పెడుతున్నారని.. కానీ మన రాష్ట్రంలో మాత్రం 10 శాతమే ఇవ్వాలని అడుగుతున్నామన్నారు. ప్రభుత్వం చాలా లిబరల్​గా వ్యవహరిస్తోందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కావాలంటే మిల్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలుసుకోవాలన్నారు. మిల్లింగ్, ఆర్జీలు సైతం గతంలో కంటే పెంచామని.. సన్నాలకు రూ.40, దొడ్డు రకాలకు రూ.30 ఇస్తున్నామన్నారు. 

రైతులకు ఇబ్బందులు రానియ్యొద్దు.. 

వచ్చే పది, పదిహేను రోజులు చాలా కీలకమని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఇంటర్మీడియెట్ గోదాముల్లో సాధ్యమైనంత స్టోరేజీ అవసరాలను అందుబాటులో ఉండేలా చూడాలని ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహన్​కు సూచించారు.