- రూ.180 కోట్లతో పరిపాలన ఉత్తర్వులు ఇచ్చిన సీఎం కేసీఆర్
- మున్నేరులో వరద వచ్చినా, ట్రాఫిక్‌తో నిత్యం భయాలే..
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం సిటీలో మున్నేరుపై కేబుల్‌బ్రిడ్జి నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం రూ.180కోట్లతో పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. గతేడాది ఆగస్టులోనే ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మించాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు వెంటనే పాలనా అనుమతులు ఇచ్చారు.
బ్రిటీష్‌కాలంలో కట్టిన్రు..
ప్రస్తుతమున్న బ్రిడ్జి బ్రిటీష్‌కాలంలో మున్నేరుపై నాటి ఖమ్మం పట్టణ అవసరాలకు అనుగుణంగా నిర్మించారు. నాటి నుంచి ఖమ్మం అభివృద్ధి చెందుతూ నగరంగా మారింది. దీంతోపాటు వాహనాల రద్దీ పెరిగింది. బ్రిడ్జి పాతది కాగా మున్నేరుకు ఏటా వరద ముప్పు పెరుగుతోంది. దీంతో ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో వరద వచ్చిన ప్రతీసారి బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నారు. దీంతో బైపాస్‌లో ఉన్న బ్రిడ్జిపై నుంచి హైదరాబాద్, వరంగల్, ఇతర మండలకేంద్రాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఇది దూరభారం కావడంతోపాటు బైపాస్‌పై ట్రాఫిక్స్తంభించేది. మరోవైపు బ్రిడ్జి ఇరుగ్గా ఉండడంతో నిత్యం ట్రాఫిక్‌జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. ప్రస్తుత వంతెనకు ప్రత్యామ్నాయంగా కేబుల్‌బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఖమ్మంవాసుల ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జి తరహాలో..
ప్రపోజల్బ్రిడ్జి 420 మీటర్ల పొడవు ఉండగా 300 మీటర్లు కేబుల్‌పై నిర్మించనున్నారు. 120 మీటర్లు ఆర్సీసీపై ఉండనుంది. నిర్మాణం పూర్తయితే రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. హైదరాబాద్‌లో దుర్గంచెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి తరహాలో మున్నేరుపై రూ.180 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు రూలింగ్పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. తాజా ఉత్తర్వులపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం సీఎం కేసీఆర్‌ను మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.