- ఇష్టారాజ్యంగా వైర్లు, బాక్సులు
- పోల్స్‌ను నింపేసిన కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు
- రాష్ట్రమంతా ఇదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్ పోల్స్ పై ఇష్టారాజ్యంగా కేబుల్ వైర్లు, కేబుల్ బాక్స్‌లు ఏర్పాటు చేయడంతో అవి ప్రమాదకరంగా మారాయి. సామర్థ్యానికి మించి కేబుల్స్, కేబుల్ బండిల్స్ తో పాటు ఇతర టెలికాం బాక్స్‌లు, పరికరాలు ఏర్పాటు చేయడంతో అవి పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. దీంతో పోల్స్ పై అదనపు భారం పడి వంగిపోయాయి.
ఇటీవల సదరన్ డిస్కం జరిపిన ఫీడర్ సర్వేలో కరెంటు స్తంభాలపై కేబుల్స్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. విద్యుత్ స్తంభాలకు వైర్లు చుట్టేయడంతో కరెంటు సమస్య వస్తే విద్యుత్ సిబ్బందికి పోల్స్ పై ఎక్కి రిపేరు చేయడం ఇబ్బందిగా మారుతోంది. కరెంటు స్తంభాలపై వైర్లు, పరికరాలు వేలాడదీయడం వల్ల పలు ప్రమాదకర ఘటనలు కూడా జరుగుతున్నాయి. సరైన పద్ధతిలో కేబుల్స్ ను అమర్చకపోవడంతో షార్ట్ సర్క్యూట్లు జరిగి విద్యుత్ ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. అంతేకాక కొన్నిచోట్ల కేబుల్స్ చిందరవందరగా ఫుట్ పాత్ పై పడి ఉండటంతో బాటసారులు, వాహనదారులు ప్రమాదాల బారినపడ్డారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
గడువు ఇచ్చినా పట్టించుకోవట్లే
ప్రమాదకరంగా మారిన కేబుళ్లను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. ఈ నెల 7న వారితో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో వారంలోగా, ఇతర ప్రధాన రహదారుల్లో రెండు వారాల్లోగా నిబంధనల ప్రకారం కేబుల్స్ అమర్చేలా చర్యలు తీసుకోవాలని ఆపరేటర్లను ఆదేశించారు. కేబుల్స్ ను తొలగిస్తామని అంగీకరించినా.. కొంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు తొలగించడం లేదు.
కేబుల్స్ ను వెంటనే తొలగించాలి: సదరన్ డిస్కం సీఎండీ
కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేసుకున్న అనవసర కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. ఇప్పటికే గడువు ఇచ్చినా స్పందించకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారులకు ఇబ్బందులు కలగవద్దనే ఉద్దేశంతో కేబుల్ సంస్థలు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల యాజమాన్యాలకు సమయం ఇచ్చామని తెలిపారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కేబుళ్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదన్నారు.