నల్లగొండ జిల్లాలో రూల్స్ కు విరుద్ధంగా సిజేరియన్లు

సూర్యాపేట వెలుగు: రూల్స్ కు విరుద్ధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిజేరియన్లు చేస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు చేసి అధికంగా సిజేరియన్లు చేస్తున్న వారిని గుర్తించినప్పట్టికీ ఒక్క ప్రైవేట్ హాస్పిటల్​కూ నోటీసు ఇవ్వలేదు. సిజేరియన్ల సంఖ్య తగ్గించాలని అధికారులు చెప్తున్నా ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ లో పలువురి డాక్టర్లకు సొంత క్లినిక్ లు ఉండడంతో చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు వెనుకడుగు వేస్తున్నారు. 

పట్టించుకుంటలే..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్​ను ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్కడ సిజేరియన్లు చేస్తూ ప్రజల నుంచి ఎక్కవ డబ్బులు గుంజుతున్నారు. ఒక్క సిజేరియన్ కు  రూ.25వేల నుంచి రూ.50వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో పని చేస్తున్న 13మంది గైనకాలజిస్ట్ లు ప్రైవేట్ క్లినిక్ లను నిర్వహిస్తుండగా.. వీటిలోనే పెద్ద ఎత్తున సిజేరియన్లు జరుగుతున్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. అయినా  చర్యలు తీసుకోవడం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్ లలో పని చేస్తున్న డాక్టర్లకు ప్రైవేట్ క్లినిక్ లు ఉండొద్దని రూల్స్ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు కొంత మంది డాక్టర్లకు నాయకులతో పరిచయాలు ఉండడంతో హాస్పిటల్ లపై చర్యలు తీసుకోవడం లేదా?  అంటున్నారు. మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ యజమాన్యం వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది సిబ్బందితో చేతులు కలిపి తనిఖీలు చేయకుండా పెద్ద ఎత్తున ప్యాకేజీలను పంపుతున్నట్టు ఆరోపణలున్నాయి. 

సిజేరియన్లు ఎక్కువ చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం ..

ప్రైవేట్ హాస్పిటల్స్​లో ఎక్కువ సిజేరియన్లు చేయొద్దని సూచించాం. రాబోయే రోజులలో ఎక్కువగా సిజేరియన్లు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేస్తాం. త్వరలో నే ఆ హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేస్తాం. పట్టించుకోకపోతే వాటి లైసెన్స్ రెన్యూవల్ కాకుండా నిలిపివేస్తాం. ఇప్పటి వరకు ఏ హాస్పిటల్ కు కూడా నోటీసులు జారీ చేయలేదు. - డాక్టర్ కోట చలం, డీఎం‌‌హెచ్‌‌ఓ, సూర్యాపేట జిల్లా