కాసుల కక్కుర్తితో కడుపు కోతలు..ప్రైవేట్ హాస్పిటళ్లలో అడ్డగోలుగా సిజేరియన్లు

  •     కాన్పు కోసం పోతే ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్లు
  •     మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్​మెంట్ సీరియస్
  •     విచారణకు హెల్త్ కమిషనర్ ఆదేశాలు.. మూడు టీంల ఏర్పాటు 
  •     జిల్లాలోని 14 ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు

మంచిర్యాల, వెలుగు :  జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో విచ్చలవిడిగా సిజేరియన్లు జరుగుతున్నాయి. కాన్పు కోసం దవాఖానాకు పోతే డాక్టర్లు కాసుల కక్కుర్తితో కడుపులు కోస్తున్నారు. ప్రభుత్వం నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని ఆదేశాలు ఇచ్చినా బేఖాతర్ చేస్తున్నారు. అవసరమున్నా, లేకున్నా సర్జరీలు చేసి పేషెంట్లను నిలువునా దోచుకుంటున్నారు.

ప్రైవేట్ హాస్పిటళ్లలో దాదాపు 90 శాతం ఆపరేషన్లు జరుగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కంట్రోల్ చేయడం లేదు. పైనుంచి ఆదేశాలు వస్తే తప్ప కదలడం లేదు. అది కూడా తూతూమంత్రంగా తనిఖీలు చేసి తప్పుడు రిపోర్టులు పంపి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. 

నార్మల్ 477.. సిజేరియన్లు 3406 

మంచిర్యాల జిల్లాలో వందకుపైగా మెటర్నిటీ హాస్పిటళ్లు, నర్సింగ్ హోమ్​లు ఉన్నాయి. వీటిలో జిల్లా కేంద్రంలోని హాస్పిటళ్లలో ఎక్కువ సంఖ్యలో డెలివరీలు జరుగుతున్నాయి. నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 3,883 డెలివరీలు జరిగాయి. ఇందులో కేవలం 477 నార్మల్ డెలివరీలు కాగా, 3,406 మందికి ఆపరేషన్లు చేశారంటే ప్రైవేట్ డాక్టర్ల తీరును అనుమానించాల్సి వస్తోంది. జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలో సరైన సౌలత్​లు, డాక్టర్లు, స్టాఫ్ లేకపోవడం వల్ల చాలామంది ప్రైవేట్ దవాఖానాలకు పోతున్నారు.

రిస్క్, హైరిస్క్ కేసులను సర్కారీ డాక్టర్లే ప్రైవేట్​కు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా ప్రైవేట్​లో ‘ముహూర్తపు డెలివరీలు’ ఎక్కువగా జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ జరిగే చాన్స్ ఉన్నప్పటికీ కొంతమంది మంచిరోజు చూసుకుని ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ముహూర్తపు డెలివరీలు చేయవద్దని ఆదేశాలిచ్చినా డాక్టర్లు లైట్ తీసుకుంటున్నారు. 

నెలకు రూ.2వేలు.. డెలివరీకి రూ.50వేలు

ప్రతి మహిళకు మాతృత్వం వరం లాంటిది అంటారు. కానీ.. అది ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులకు, డాక్టర్లకు వరంలా మారింది. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో కూతురో, కోడలో నీళ్లోసుకుందన్న సంతోషం కంటే డెలివరీ ఖర్చుల భయమే వెంటాడుతోంది. ప్రైవేట్ హాస్పిటళ్లలో నెలనెలా చెకప్​లకు రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చవుతాయి. అవసరం లేకున్నా ప్రతిసారీ బ్లడ్ టెస్టులు, స్కానింగ్​లు, గోలీలు, టానిక్​లు అంటూ అందినంత దోచుకుంటున్నారు. గర్భిణులు మంచం మీద నుంచి కదలొద్దని సలహాలిచ్చి నార్మల్ డెలివరీ అయ్యే చాన్స్ ఉన్నా లేకుండా చేస్తున్నారు.

ఇక నార్మల్ డెలివరీకి రూ.20వేల నుంచి రూ.30వేలు, సిజేరియన్​కు రూ.50వేల ప్యాకేజీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ హాస్పిటళ్లలో డెలివరీ అంటేనే పేద, మధ్య తరగతి ప్రజలు జడుసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. కడుపు కోతల వల్ల లేడీస్​కు భవిష్యత్​లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

హెల్త్ కమిషనర్ సీరియస్

జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న సిజేరియన్లు సామాన్యులనే కాదు స్టేట్ హెల్త్ డిపార్ట్​మెంట్ ఉన్నతాధికారులను సైతం కలవరపరుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా ఫస్ట్ కలెక్టర్​గా పనిచేసిన ఆర్వీ కర్ణన్ ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్​గా ఉన్నారు. ఆయన జిల్లాలో ఎక్కువగా సి సెక్షన్లు జరుగుతున్న 14 హాస్పిటళ్లపై ఎంక్వయిరీకి ఆదేశించారు.

ఈ మేరకు డీఎంహెచ్వో డాక్టర్ జీసీ సుబ్బరాయుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో మూడు టీంలను ఏర్పాటు చేశారు. వీరు సంబంధిత హాస్పిటళ్లలో సిజేరియన్లు ఎందుకు జరుగుతున్నాయని పరిశీలించి రిపోర్టు ఇవ్వనున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.