
- కాగ్ రిపోర్టుల్లో వెల్లడి
- 2019-20 నుంచి 2023-24 వరకు ఇదే తీరు
- ఆదాయం, ఖర్చుల అంచనాల్లో కుదరని లెక్క
- 2023-24లో రూ.66 వేల కోట్లు తేడా
- తీసుకున్న అప్పులనూ దారిమళ్లించిన్రు
- ఓడీ వంటి చేబదుల్లతోనే సర్కార్ నడిపారని కాగ్ చురక
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్అంచనాలు ప్రతిసారీ తలకిందులు అయ్యాయి. బడ్జెట్‌లో భారీగా అంచనాలు వేయడం.. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆ మేరకు ఆదాయం రాకపోవడంతో అంచనాల మేర ఖర్చు చేయలేదని కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) స్పష్టం చేసింది. గురువారం అసెంబ్లీలో ఫైనాన్స్‌కు సంబంధించి కాగ్ నివేదికలను ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వం అవగాహన లేకుండా బడ్జెట్ పెట్టినట్టు ఉందని కాగ్ పేర్కొన్నది. ఒక్కసారి కూడా బడ్జెట్ రియలైజేషన్ కాలేదని.. కనీసం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదని వెల్లడించింది. అవకాశం లేనిచోట కూడా ఎక్కువ ఆదాయాన్ని అంచనా వేయడం, ఫలితంగా ఖర్చులు దేనికి చేయాలని ఉద్దేశించారో దానికి చేయలేకపోయారని తెలిపింది. గ్రాంట్ ఇన్ఎయిడ్లో పెద్ద మొత్తంలో చూపించి బడ్జెట్‌ను సరిగా ప్లాన్చేయలేదని.. చివరకు ముఖ్యమైన పథకాలను కూడా పక్కకు పెట్టి బడ్జెట్‌లో పేర్కొనని కార్యక్రమాలు అమలు చేసినట్టు పేర్కొంది. 2019–20 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు ఇదే పరిస్థితి నెలకొన్నట్టు వెల్లడించింది.
ఐదు ఆర్థిక సంవత్సరాలలో ఎప్పుడూ వాస్తవానికి దగ్గర బడ్జెట్ ప్రతిపాదించలేదని కాగ్ నివేదికలతో స్పష్టమవుతున్నది. 2020-–21లో రూ.1.38 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. రూ.1.23 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే అనుకున్న దానికంటే 11% తేడా వచ్చింది. దాదాపు రూ.15,458 కోట్లు ఖర్చు చేయలేదని కాగ్ తెలిపింది. ఇలా ఏటా ఈ మొత్తం పెరుగుతూ పోయిందని వెల్లడించింది. 2021-–22లో రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.1.36 లక్షల కోట్లు మాత్రమే చేశారు. అంటే అనుకున్న పథకాలకు, ప్రాజెక్టులకు ఇతర ప్రాధాన్య వర్క్‌లకు రూ.43 447 కోట్లు ఖర్చు చేయలేదని తెలిపింది. అంచనాల్లో ఈ గ్యాప్ 24 శాతమని కాగ్నివేదికలో పేర్కొన్నది. 2022–23లో రూ.1.89 లక్షల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో పెట్టుకోగా.. ఇందులో రూ.1.53 లక్షల కోట్లు మాత్రమే చేశారు. అంటే రూ.35868 కోట్లు ఖర్చు కాకుండా మిగిలిపోయాయి. అనుకున్న లక్ష్యంలో ఇది 19% గ్యాప్. ఎన్నికల ఏడాది చివరి సంవత్సరం 2023–24లో రూ.2.34 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు బడ్జెట్లో అంచనాలు వేశారని.. ఇందులో రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని కాగ్ తెలిపింది. ఎప్పుడూ లేని విధంగా రూ.66,017 కోట్లు ఖర్చు చేయలేదని నివేదికలో పేర్కొంది. అనుకున్న లక్ష్యంలో 28% ఖర్చు పెట్టలేదని వివరించింది. ఈ రెవెన్యూ ఖర్చుల్లో సోషల్, ఎకనామిక్, జనరల్, డెట్ సర్వీసులు (ఇంట్రెస్ట్పేమెంట్లు) ఉన్నాయి.
రూ.81,469 కోట్ల అప్పులు దారి మళ్లినయ్..
గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు, డెవలప్మెంట్పనుల కోసం క్యాపిటల్ఎక్స్ పెండిచర్కింద తీసుకున్న అప్పులను దారిమళ్లించింది. ప్రాజెక్టులు, పనుల కోసం అప్పులను తీసుకుంటున్నట్టు చూపించి.. వాటికోసం ఖర్చు చేయలేదని కాగ్ స్పష్టం చేసింది. 2019–20 నుంచి 2023–24 వరకు ప్రతిసారి వేల కోట్ల రూపాయాలు పక్కదారి పట్టినట్లు తెలిపింది. ఫలితంగా ఆస్తుల సృష్టి జరగలేదని వెల్లడించింది. 2019–20లో రూ.38,285 కోట్లు అప్పులు తీసుకుంటే అందులో రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా మొత్తం అంటే రూ.12 వేల 726 కోట్లు వేరే వాటికి మళ్లాయి. 2020–21లో రూ.47,132 కోట్లు అప్పులు తీసుకుంటే.. రూ.26 వేల కోట్లు మాత్రమే క్యాపిటల్ఖర్చులు చేశారు. 2021–22లో రూ.46,995 కోట్లు మూలధనం వ్యయం కోసం అప్పులు చేయగా.. అందులో రూ.17,881 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.50,528 కోట్లు అప్పు చేస్తే.. రూ.43,918 కోట్లు ఖర్చు చేశారు. మిగతా మొత్తం దారిమళ్లించినట్లు కాగ్ పేర్కొన్నది.
కాగ్ రిపోర్టుల్లోని అంశాలు..
ఫిస్కల్ అడ్మినిస్ర్టేషన్, ప్లానింగ్, సర్వే స్టాటిస్టిక్స్ లో పబ్లిక్డెట్ కింద రూ.12,795 కోట్లు బడ్జెట్లో అంచనా వేస్తే.. ఇందులో రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేశారు. అంటే అంచనా వేసిన దానికంటే 757 శాతం అధికంగా చేశారు. ఇందులో వేస్ అండ్మీన్స్కింద చేసిన రీపేమెంట్స్ఎక్కువ ఉన్నట్లు కాగ్పేర్కొన్నది.
ఇలా వేస్అండ్ మీన్స్, ఓవర్ డ్రాప్ట్( ఓడీ)ల కింద చేబదులు అప్పులు తీసుకుని రాష్ట్రాన్ని నడిపినట్టు కాగ్ వెల్లడించింది. ఈ రెండూ లేకపోతే రాష్ట్ర వ్యవహారం చక్కబెట్టమే కష్టం అన్నట్టుగా పరిస్థితి తయారైందని తెలిపింది.
ఇక అప్పుల విషయంలో 2019–20లో ఎఫ్ఆర్‌బీఎం పరిధిలో రూ.2.32 లక్షల కోట్లు ఉండగా... 2023–24 నాటికి రూ.4.03 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం జీఎప్డీపీలో 27 శాతం అప్పులు తీసుకున్నారు. ఒక్క సంవత్సరంలోనే 2023–24లో అంతకు ముందు ఏడాది కంటే అదనంగా రూ.47,178 కోట్లు అప్పులు తీసుకున్నారు.
గ్యారంటీ అప్పులకు సంబంధించి 200 శాతం పెంచుకునేందుకు ఎఫ్ఆర్‌బీఎం యాక్ట్ 2020కు సవరణ చేసి ఇష్టారీతిన అప్పులు తెచ్చుకున్నట్లు కాగ్నివేదికలో పేర్కొన్నది. 2023–24 సంవత్సరంలో రూ.31,280 కోట్లు గ్యారంటీ లోన్లు తెచ్చుకున్నట్లు తెలిపింది. ఇక 2024 మార్చి 31 నాటికి గ్యారంటీ అప్పులు రూ.2.20 లక్షల కోట్లు కాగా.. ఇందులో రూ.1.20 లక్షల కోట్లు కార్పొరేషన్లు, ఎస్పీవీల నుంచి తీసుకోగా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చేసేవని తెలిపింది.
2023–24 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీలు, అర్బన్లోకల్బాడీలకు రూ.13,690 కోట్లు ఇచ్చినట్లు కాగ్పేర్కొంది. అంతకు ముందు సంవత్సరంతో చూస్తే ఈ మొత్తం 9 శాతం తగ్గింది.
జీతాలు, పెన్షన్లు, వడ్డీలకే 45% చెల్లింపులు..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుల్లో 45 శాతం మూడింటికే పోతున్నది. కాగ్‌నివేదిక ప్రకారం ఇందులో ఉద్యోగుల శాలరీలు, రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్లు, గత అప్పులకు కడుతున్న వడ్డీలే ఉన్నాయి. ఇది ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతూ పోతున్నది. వీటిలో శాలరీలకు అత్యధికంగా రూ.30 వేల కోట్లపైనే ఉండగా.. ఆ తరువాత వడ్డీలు, పెన్షన్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడింటికి ఖర్చు చేసిన మొత్తం రూ.75,456 కోట్లుగా ఉన్నది. మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ రూ.1.68 లక్షల కోట్లు కాగా మూడింటికి చేసిన మొత్తం ఖర్చు 45 శాతంగా కాగ్ వెల్లడించింది. 2019-20లో జీతాలు, పెన్షన్లు, వడ్డీల పేమెంట్‌కు రూ.50,784 కోట్లు ఖర్చు చేశారు. 2020-21లో రూ.55,210 కోట్లు, 2021-22లో రూ.63,561 కోట్లు , 2022-23లో రూ.68,600 కోట్లు ఖర్చు చేశారు.
దారిమళ్లిన క్యాపిటల్ అప్పులు..
ఏడాది దారిమళ్లిన నిధులు
(రూ.కోట్లలో)
2019–20 12,726
2020–21 20,342
2021–22 18,112
2022–23 23,679
2023–24 6,610