- అప్రూవ్డ్ డిజైన్లు, డ్రాయింగ్స్ అందజేయాలని స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్‌కు ఆదేశం
- కేవలం ఖర్చు మాత్రమే కాదు.. డిజైన్లనూ ఆడిట్ చేయాల్సి ఉందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్స్‌పై కంప్ట్రోలర్అండ్ఆడిటర్జనరల్(కాగ్) నజర్పెట్టింది. ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చు మాత్రమే కాదు.. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సైతం ఆడిట్చేయాల్సి ఉందని తేల్చి చెప్పింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్స్, డ్రాయింగ్స్ అందజేయాలని స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని సెంట్రల్ డిజైన్స్ఆర్గనైజేషన్ (సీడీవో)ను ఆదేశించింది. ఈ మేరకు సీడీవోకు కాగ్ లెటర్ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ఆమోదించడానికి అనుసరించిన ప్రొసీజర్, మెథడాలజీ ఏమిటో చెప్పాలని లేఖలో కోరింది. ఈ డిజైన్లను ఆమోదించడానికి తప్పనిసరైన విధానం ఏదైనా ఉందా? అని ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం తెలిపే క్రమంలో ఏదైనా ఎక్స్పర్ట్, అపెక్స్ఇన్స్టిట్యూట్ సేవలను వినియోగించుకున్నారా? ఒకవేళ వినియోగించుకుంటే ఆయా సంస్థల పేర్లు, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్డిజైన్స్, డ్రాయింగ్స్ ను 2018 ఏప్రిల్ నుంచి 2020 మే మధ్యఆమోదించే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో భూకంప ప్రభావ పరిస్థితులను అధ్యయనం చేయలేదని పేర్కొంది. పుణెలోని సెంట్రల్ వాటర్అండ్ పవర్ రీసెర్చ్‌స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్), ఐఐటీ రూర్కీ నుంచి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు అడిగినా, ఆ డేటా సమర్పించలేదని తెలిపింది. ఒకవేళ ఆ వివరాలుంటే తమకు సమర్పించాలని కోరింది. వ్యాప్కోస్ రూపొందించిన ప్రాజెక్టు డీపీఆర్‌లోని కాళేశ్వరం డిజైన్స్, డ్రాయింగ్స్అన్ని సీడీవో పరిశీలించి ఆమోదించిందా లేదా అనే వివరాలు సమర్పించాలని ఆదేశించింది.