దళితబంధు కార్పొరేషన్​లో పైసలున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేయలే : CAG

దళితబంధు కార్పొరేషన్​లో పైసలున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేయలే : CAG
  • గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన కాగ్
  • 38,511 అప్లికేషన్లు వస్తే 21,339 మందికే సాంక్షన్ 
  • 2021- 22లో హుజూరాబాద్ సహా మిగతా పైలట్ మండలాల్లో  నిధుల వినియోగంలో నిర్లక్ష్యం
  • ఎన్నికల ముందు 4600 మందికి ఇచ్చింది రూ.5 లక్షల చొప్పునే.. 

కరీంనగర్​, వెలుగు: దళితబంధు స్కీమ్ అమలుకు కావాల్సినన్ని నిధులు ఖాతాల్లో ఉన్నప్పటికీ అప్పటి బీఆర్​ఎస్ ​ప్రభుత్వం లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అందజేయలేదని కంప్ట్రోలర్​ ఆఫ్ ఆడిటర్ జనరల్(కాగ్) అభిప్రాయపడింది. దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలు, వాసాలమర్రి గ్రామం నుంచి మొత్తం 38,511 అప్లికేషన్లు వస్తే 21,339 మందికి మాత్రమే దళిత బంధు సాంక్షన్ చేశారని, నిధులున్నా మిగతా వారికి మంజూరు చేయలేదని వెల్లడించింది.

 2021 ఆగస్టు వరకు కేవలం హుజురాబాద్ నియోజకవర్గం మీదే దృష్టి పెట్టిన ప్రభుత్వం.. తర్వాత పైలట్ ప్రాజెక్టులోని మిగతా మండలాలు, గ్రామాలకు పైసా ఇవ్వలేదని పేర్కొంది. 2021– 22 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు కోసం రిలీజ్ చేసిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయలేదని చెప్పింది.  అలాగే 2022 – 23 బడ్జెట్ లోనూ దళిత బంధు స్కీమ్ కోసం రూ.17,700 కోట్లు కేటాయించినప్పటికీ.. కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. ఆ ఆర్థిక సంవత్సరంలో నిధులు ఎక్కువ కేటాయించి తక్కువ ఖర్చు చేసింది ఈ స్కీమ్ కేనని అభిప్రాయపడింది.

దళితబంధు కోసం ఇతర స్కీమ్ లకు నిలిపివేత

రాష్ట్రంలో 2021– 22 ఆర్థిక సంవత్సరంలో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ స్కీమ్​కు రూ. వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే, వివిధ స్కీమ్​లకు  నిధులు ఖర్చు చేయకుండా పొదుపు చేయడం ద్వారా మిగిలిన రూ.3,498 కోట్ల సోషల్ వెల్ఫేర్ గ్రాంట్స్​ను సీఎం దళిత ఎంపవర్ మెంట్ స్కీమ్(దళిత బంధు)కు కేటాయించి ఉండొచ్చని కాగ్ అభిప్రాయపడింది. ఇలా మళ్లించిన నిధుల్లో ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్​కు  చెందిన రూ.1,338 కోట్లు, గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిధులు రూ.1,275 కోట్లు, పట్టణ పేదల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించిన రూ.885 కోట్లు ఉన్నాయి. 

కేటాయించిన వాటిలో ఖర్చు చేసింది సగమే.. 

దళిత బంధు స్కీమ్ అమలు కోసం 2021 –-22లో రూ.4,442 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ సీసీడీసీఎల్) డిపాజిట్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేసింది. ఇందులో టీఎస్ సీసీడీసీఎల్ రూ.3,107 కోట్లను డిపాజిట్ ఖాతా నుంచి తన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్​ఫర్​ చేసుకుంది. ఈ నిధుల్లో నుంచి రూ.3,041 కోట్లను హుజూరాబాద్ లో దళితబంధు పైలట్ ప్రాజెక్ట్ కోసం కరీంనగర్ అడ్మినిస్ట్రేషన్ ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేశారు. 

తొలి విడతలో హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేశాక, మార్చి 2022లో కరీంనగర్ జిల్లా అధికారులు రూ.157 కోట్లను దళితబంధు కార్పొరేషన్​కు రిటర్న్ చేశారు. వాస్తవానికి రూ.3,041 కోట్లలో 2022 మార్చి వరకు హుజూరాబాద్ లో ఖర్చు చేసింది రూ.2,101 కోట్లు మాత్రమే. రూ.783 కోట్లు జిల్లాలోని వివిధ శాఖల ఆఫీసర్ల దగ్గరే ఉండిపోయాయని, వీటిని ఎందుకు వినియోగించలేదనే విషయంలో సమాచారం లేదని కాగ్ పేర్కొంది. రూ.4,442 కోట్ల నిధులకు గాను రూ.2,101 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగిందని, దళిత బంధు స్కీమ్ కు సర్కార్ నిర్దేశించుకున్న లక్ష్యంలో తొలి ఏడాదిలో 47 శాతమే చేరుకోగలిగిందని కాగ్ అభిప్రాయపడింది.  

హుజురాబాద్ లో 4,600 మందికి రూ.5 లక్షలే.. 

హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమయంలో 18,021 మందిని దళితబంధు స్కీమ్ లబ్ధిదారులుగా గుర్తించగా.. తొలుత 13,400 మందికి యూనిట్లు మంజూరు చేశారు. మరో 4,600 మందికి బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సాంక్షన్ ఆర్డర్ ఇవ్వగా.. వారంతా రూ.10 లక్షల విలువైన యూనిట్లను ప్రారంభించారు. అయితే అప్పటి ప్రభుత్వం మాత్రం వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.5 లక్షలు మాత్రమే జమ చేసి, మిగతా సగం డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు.

హుజూరాబాద్ తర్వాత నత్తనడకన స్కీమ్ 

దళిత బంధు స్కీమ్ ను మొదట కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం, ఆలేరు నియోజకవర్గంలోని వాసలమర్రి గ్రామంతోపాటు సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్, కామారెడ్డి జిల్లాల్లోని ఒక్కో ఎస్సీ నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో పైలట్ పద్ధతిలో ప్రారంభించారు. అంతేగాక, అదే ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు.

 అయితే, 2021 ఆగస్టు వరకు ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మీదే బీఆర్​ఎస్​ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, దళిత కార్పొరేషన్ ఖాతాల్లో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ..ఆ తర్వాతి నెలల్లో మిగతా నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయలేదని కాగ్ వెల్లడించింది. 2021–-22లో రాష్ట్రవ్యాప్తంగా 38,511 మంది దరఖాస్తు చేసుకుంటే మార్చి 2022 నాటికి 21,339 అప్లికేషన్లను మాత్రమే అప్రూవ్ చేసినట్టు తెలిపింది. 

2022 మార్చి 31వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.29 కోట్లు(421 అప్లికేషన్లు), జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రూ.10 కోట్లు(151), ములుగు జిల్లాకు రూ.8 కోట్లు(119), రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.14 కోట్లు(205), నిర్మల్ జిల్లాకు రూ.17 కోట్లు(256 అప్లికేషన్లు) నిధులు రిలీజ్ చేసినప్పటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా దళితబంధు ఇవ్వలేదని వెల్లడించింది.