లిక్కర్​పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం.. మళ్లీ తెరపైకి తెచ్చిన బీజేపీ సర్కార్

లిక్కర్​పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం.. మళ్లీ తెరపైకి తెచ్చిన బీజేపీ సర్కార్

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం హాట్​హాట్‎గా ప్రారంభమయ్యాయి. సభనుద్దేశించి లెఫ్టినెంట్​గవర్నర్​వీకే సక్సేనా ప్రసంగం తర్వాత ఢిల్లీ లిక్కర్​ పాలసీపై కాగ్​ రిపోర్ట్‎ను బీజేపీ సర్కారు ప్రవేశపెట్టింది. ఈ నివేదికను సీఎం రేఖాగుప్తా టేబుల్​చేయగా.. దీనిపై చర్చకు స్పీకర్​విజేందర్​గుప్తా అనుమతించారు. సీఎంవో నుంచి అంబేద్కర్, మహాత్మాగాంధీ, భగత్​సింగ్​ఫొటోలు తొలగించారంటూ ప్రతిపక్ష ఆప్​ నేతలు నిరసనకు దిగగా.. వారిని స్పీకర్​సస్పెండ్​చేశారు.

 ఇదిలా ఉండగా.. 2021–-22లో ఆమ్​ఆద్మీ పార్టీ(ఆప్) తీసుకొచ్చిన లిక్కర్​పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,002 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు కాగ్ రిపోర్ట్‎లో​వెల్లడించింది. ఈ పాలసీ వల్ల నాటి సర్కారు రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నది. లైసెన్స్ ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయిందని, మినహాయింపుల రూపంలో  రూ.144 కోట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు సరిగ్గా సేకరించకపోవడంతో రూ.27 కోట్లు లాస్​ అయినట్టు వెల్లడించింది. మొత్తంగా ఈ నష్టం రూ.2 వేల కోట్లకు పైగా ఉందని తెలిపింది.

ఎక్స్​పర్ట్​ప్యానెల్​ సిఫార్సులు పట్టించుకోలే..

లిక్కర్​పాలసీలో మార్పులను సూచించడానికి ఏర్పాటు చేసిన ఎక్స్‏పర్ట్​ప్యానెల్ సిఫార్సులను విస్మరించారని,  కంప్లయింట్స్​వచ్చినా బిడ్డింగ్‎ను అనుమతించారని, ఉల్లంఘనలకు ఎలాంటి జరిమానాలు విధించలేదని కాగ్​ నివేదికలో వెల్లడించింది. దీంతో పాటు పాలసీ రూపకల్పనలోనూ పారదర్శకత పాటించలేదని తేల్చింది.ఈ విషయాలను నాటి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్​మంత్రి మనీశ్​సిసోడియా దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని కాగ్​ రిపోర్ట్​వెల్లడించింది. కేబినెట్ఆమోదం లేకుండా.. లెఫ్టినెంట్ గవర్నర్‌‌ను సంప్రదించకుండానే ఆర్థికంగా భారీ ప్రభావాన్ని చూపే మినహాయింపులు, రాయితీలను ఇచ్చారని కాగ్​రిపోర్ట్‎లో పేర్కొన్నది.  

ఆప్​ నేతల నిరసన..

సీఎం ఆఫీస్‎లో ఏర్పాటుచేసిన అంబేద్కర్, భగత్​సింగ్​ఫొటోలను తొలగించారంటూ సభలో ప్రతిపక్ష ఆప్​నేతలు నిరసనకు దిగారు. ఎల్జీ వీకే సక్సేనా ప్రసంగిస్తున్న సమయంలో అడుగడుగునా అడ్డుపడ్డారు. ‘జై భీమ్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం ఆతిశీ సహా 15 మంది ఆప్​ ఎమ్మెల్యేలను స్పీకర్​విజేందర్​ గుప్తా సభా కార్యకలపాల నుంచి ఒకరోజంతా సస్పెండ్​చేశారు. అలాగే, సభను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.