- ప్రతిపాదిత ఎఫ్ఆర్ఎల్కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు?
- ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం
- పంప్‌హౌస్‌లపై బీఆర్‌కే భవన్‌లో జస్టిస్ ఘోష్ విచారణ
- 14 మంది ఇంజినీర్ల హాజరు.. 16 లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశం
- కాళేశ్వరం అవినీతిపై కమిషన్‌కు అందిన కాగ్ రిపోర్ట్
- కమిషన్ తొలిదశ ఎంక్వైరీ పూర్తి.. రెండో దశ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన పంప్‌హౌస్‌ల మునకకు కారణమేంటని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లను జ్యుడీషియల్‌కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రశ్నించినట్టు తెలిసింది.
ప్రతిపాదిత ఫుల్ రిజర్వాయర్ లెవెల్ (ఎఫ్‌ఆర్‌ఎల్) కు తక్కువ ఎత్తులో పంప్‌హౌస్‌లను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో కారణాలు అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌ల నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల ప్రక్రియ సాగిన తీరు, మునకకు బాధ్యులెవరు? రిపేర్ల ఖర్చు ఎవరు భరించారు? పంప్‌హౌస్‌ల మునక, రిపేర్లను అంత సీక్రెట్‌గా ఎందుకు చేయాల్సి వచ్చింది? లాంటి ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టినట్టు సమాచారం.
సోమవారం బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఆఫీసులో పంప్‌హౌస్‌లపై జరిగిన విచారణకు 14 మంది ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు హాజరయ్యారు. వారు చెప్పిన వివరాలన్నింటినీ ఈ నెల 16లోగా అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. 2022 జులైలో వచ్చిన గోదావరి వరదల్లో కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు నీటమునిగిన విషయం తెలిసిందే. నాడు కన్నెపల్లి పంప్హౌస్సేఫ్టీ వాల్ కూలి 17 మోటార్లు దెబ్బతిన్నాయి. 5 మోటార్లు పనికిరాకుండా డ్యామేజ్అయ్యాయి.
భారీ వరదల కారణంగానే పంప్ హౌస్‌లు నీటమునిగాయని సర్కారు చెప్పినప్పటికీ ఎఫ్ఆర్ఎల్ దిగువన కట్టడం వల్లే కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌస్‌లు నీటమునిగాయనే ఆరోపణలు వచ్చాయి. పనులు సీక్రెట్‌గా జరగడం వల్ల నాటి సర్కారు, ఏజెన్సీ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజా ఎంక్వైరీలో భాగంగా అటు ఇంజినీర్లు.. ఇటు ఏజెన్సీ ప్రతినిధుల నుంచి కమిషన్ పంప్‌హౌస్‌లకు సంబంధించిన కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది.
ప్రభుత్వం కూడా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్టేటస్‌పై రాష్ట్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ సమర్పించాలని జస్టిస్ ఘోష్ ఆదేశించారు. అలాగే, అన్ని రకాల ఫైళ్లను త్వరగా సమర్పించాలని సూచించినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అక్రమాలపై కమిషన్‌కు కాగ్ రిపోర్ట్ అందినట్టు తెలిసింది.
ఆ రిపోర్ట్‌ను పరిశీలించాక కాగ్ అధికారులను కూడా కమిషన్ విచారణకు పిలువనుంది. మరోవైపు ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్ ఫైనల్ రిపోర్టు కూడా త్వరగా ఇవ్వాలని మరోసారి కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించినట్టు తెలిసింది.
తొలిదశ విచారణ పూర్తి
మూడు బ్యారేజీల డ్యామేజీ పరిస్థితిని తెలుసుకునేందుకు కమిషన్ ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ.. కమిషన్‌కు రిపోర్ట్‌ను అందజేసినట్టు సమాచారం. ఇటు ఇప్పటిదాకా వచ్చిన అఫిడవిట్లు, సాక్ష్యాధారాలను పరిశీలించాక కమిషన్పలువురికి నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. కాగా, ఇవాళ్టితో తొలి దశ విచారణను పూర్తిచేసిన కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్.. ఇక, రెండో దశ విచారణను మొదలుపెట్టింది. ఈ దఫా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు.