మూడు జిల్లాల్లో భూముల లెక్కలు తీయండి.. బీఆర్ఎస్ హయాంలో భూములు ప్రైవేట్​పరం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​ చుట్టు పక్కల జిల్లాల్లో భూ అక్రమాల తేనెతుట్టె కదులుతు న్నది. గత బీఆర్ఎస్ సర్కారు​హయాంలో కలెక్టర్​గా ఉండి వేల కోట్ల భూదందాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్​ అమోయ్​ కుమార్​  కేసులో ఈడీ తీగ లాగుతుంటే.. అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  అమోయ్​కుమార్​పై ​విచారణ మొదలైనప్పటి నుంచి అటు ఈడీతో పాటు ఇటు సీఎంవోకు సైతం పెద్ద సంఖ్య లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకొని, ఎకరా కోట్లు పలికే ప్రైమ్​ ఏరియాల్లోని లిటిగేషన్​ భూములు, ప్రభుత్వ, అసైన్డ్​, ఎండోమెంట్, ఫారెస్ట్​​ భూములను ప్రైవేట్​వ్యక్తుల పేరిట పట్టాలుగా మార్చారనేది అమోయ్​కుమార్​పై ఉన్న ప్రధాన ఆరోపణ. 

ఈ వేల కోట్ల విలువైన భూ బాగోతాన్ని నడిపేందుకే ఓ మాజీ మంత్రికి నమ్మిన బంటుగా ఉన్న అమోయ్​కుమార్​ను మేడ్చల్​ మల్కాజ్​ గిరి, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్​గా, హైదరాబాద్​కు ఇన్​చార్జి కలెక్టర్​గా నియమించినట్టు తెలిసింది. ఈ పీరియడ్​లోనే రెండు జిల్లాలతోపాటు సంగారెడ్డి జిల్లాలోనూ పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఐఏఎస్​ అమోయ్​కుమార్​..  స్వామికార్యం కింద ఓవైపు నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వ, అసైన్డ్, ఎండోమెంట్, ఫారెస్ట్​ భూములకు పట్టాలు సృష్టించడంతో పాటు  స్వకార్యంలో భాగంగా లిటిగేషన్​ ఉన్న భూములను సైతం ఎకరాకు లక్షల్లో తీసుకొని ప్రైవేట్​పరం చేసినట్టు నిర్ధారించింది. కొన్ని చోట్ల ఫిఫ్టీ–ఫిఫ్టీ అగ్రిమెంట్లు చేసుకుని మరీ వ్యవహారం నడిపినట్టు సీఎం రేవంత్​ దృష్టికి వెళ్లింది. దీంతో పాస్​బుక్​ డేటా కరెక్షన్ కింద అమోయ్​కుమార్​ ఎన్ని ప్రొసీడింగ్స్​ ఇచ్చారో.. వాటన్నింటినీ బయటకు తీయాలని  రేవంత్​రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. 

అప్పుడెంత.. ఇప్పుడెంత?

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్​ మల్కాజ్​ గిరి జిల్లాల్లోనే  పెద్ద ఎత్తున గవర్నమెంట్, ఎండోమెంట్, ఫారెస్ట్, అసైన్డ్​, భూదాన్​భూములు ప్రైవేట్​పరమైనట్టు ప్రాథమికంగా గుర్తించారు.  అసలు ఎన్ని భూములు ఇలా అన్యాక్రాంతమయ్యాయో తేల్చాలని ఉన్నతాధికారులను ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలిసింది. ధరణి అమల్లోకి తేకముందు ఆయా జిల్లాల్లో గవర్నమెంట్, ఎండోమెంట్, ఫారెస్ట్​, అసైన్డ్​, భూదాన్​భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ధరణి వచ్చాక వాటి పరిస్థితి ఏమిటి? అనేదానిపై సమగ్ర రిపోర్ట్​ ఇవ్వాలని సీఎం స్వయంగా ఆర్డర్​ వేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రెవెన్యూ, ఎండో మెంట్​, ఫారెస్ట్​ ఆఫీసర్లు రంగంలోకి దిగి, వివరాలు సేకరిస్తున్నారు. 

భూముల వివరాలను సరిపోల్చాలని ప్రభుత్వం చూస్తున్నది. ప్రస్తుతం ఆయా డిపార్ట్​మెంట్ల దగ్గర ఉన్న వివరాల ప్రకారం చూసినా ధరణికి ముందు ఉన్న భూములతో, ఇప్పటి భూములకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. ఉదాహరణకు రాష్ట్రంలో దాదాపు 90 వేల ఎకరాల ఎండోమెంట్​ భూములు ఉండగా.. ప్రస్తుతం కేవలం 50 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో ఎంట్రీ అయింది.  వక్ఫ్​ ల్యాండ్​దీ ఇదే పరిస్థితి. ఇక ఫారెస్ట్​ యాక్ట్​లో సెక్షన్​– 15  ప్రకారం రాష్ట్రంలో అటవీ భూములు  53 లక్షల ఎకరాలు కాగా,  ధరణి పోర్టల్​లో 47 లక్షల ఎకరాలు మాత్రమే ఎంట్రీ అయింది.  ఇంకో 6 లక్షల ఎకరాలు ఏమైందో అంతు చిక్కడం లేదు.   ప్రస్తుతం ప్రభుత్వ భూములు15 లక్షల ఎకరాల మేర ఉన్నట్టు తెలుస్తున్నా.. 2014కు ముందు సర్కారుకు ఎన్ని ఎకరాల ల్యాండ్స్​ ఉన్నాయో తెలియని పరిస్థితి.

   తెలంగాణ స్టేట్​ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్​ (టీఎస్​ఐఐసీ) కింద ఉన్న సుమారు 35 వేల ఎకరాల భూముల వివరాలు కూడా ధరణిలో నమోదు కాలేదు.  ఈ వివరాలతో పాటు  అసైన్డ్​ భూముల వివరాలను అధికారులు లెక్కతీస్తున్నారు.  ఇటీవలే ధరణి పోర్టల్​ నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగిస్తూ  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నదని, తద్వారా గత సర్కారు హయాంలో జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తాయని సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'కు తెలిపారు. 

సీఎంకు  అందిన కంప్లయింట్స్ ఇలా..

అమోయ్‌‌‌‌కుమార్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌గా ఉన్న సమయంలో గోపనపల్లిలో 50 ఎకరాలు, మాదాపూర్‌‌‌‌లో 5 ఎకరాలు, హఫీజ్‌‌‌‌పేటలో 20 ఎకరాలు, మోకిలలో 115 ఎకరాలు, వట్టినాగులపల్లిలో 20 ఎకరాలు, గండిపేట ఖానాపూర్‌‌‌‌లో 150 ఎకరాలు, మియాపూర్‌‌‌‌లో 27 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు ఫిర్యాదులు అందాయి. –కూకట్‌‌‌‌పల్లి సమీపంలోని హైదర్‌‌‌‌నగర్‌‌‌‌ దగ్గర మూడెకరాల భూమిని కూడా  ధరణిని అడ్డుపెట్టుకొని ప్రైవేట్‌‌‌‌ వ్యక్తులకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేసినట్టు కంప్లయింట్​ ఉంది. 
 
ఆదిబట్లలో సర్వే నంబర్​–44లోని సీలింగ్‌‌‌‌ భూములైన 18 ఎకరాలను కొంతమందికి పట్టాదార్‌‌‌‌ పాస్‌‌‌‌బుక్​లు ఇచ్చినట్టు ఫిర్యాదు అందింది.

శామీర్‌‌‌‌పేట మండలం తూముకుంటలోని ఫారెస్ట్​ భూములకు సంబంధించి సర్వే నంబర్​ 164లో మొత్తం 26 ఎకరాలు, సర్వే నంబరు 165/1, సర్వేనంబరు 1266లోని భూములను కూడా మార్చినట్టు గుర్తించారు.  1953లోనే ఆ సర్వే నంబర్​లోని భూములు రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ కోసం కేటాయించినట్టు గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌లో ఉన్నా..  వారసులం అంటూ కొందరు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా వారికి ఆ భూములు ధారాదత్తం చేశారు.  

గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్  124/10లో 50 ఎకరాలు, సర్వే నెంబర్  36, 37లో 600 ఎకరాలు, హఫీజ్‌‌‌‌పేట సర్వే నెంబర్  80లో 20 ఎకరాలు, మోకిలా దగ్గర సర్వే నెంబర్  555లో బిల్లాదాఖల భూములు 150 ఎకరాలు, మేడ్చల్‌‌‌‌ మల్కాజ్‌‌‌‌గిరి జిల్లా, కూకట్‌‌‌‌పల్లి మండలం ఎల్లమ్మబండ (షాంబిగూడ) పరిధిలో సర్వే నెంబర్  57లో 92 ఎకరాలను చట్టవిరుద్ధంగా ఎక్కించినట్టు ఫిర్యాదు అందింది.