నల్లా లేని ఇండ్లు 2 లక్షల పైనే!

నల్లా లేని ఇండ్లు 2 లక్షల పైనే!
  • ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ సర్వేతో తేలుతున్న కొత్త ఇండ్ల లెక్క 
  •     ఖమ్మం జిల్లాలో 84 శాతం, భద్రాద్రి జిల్లాలో 90శాతం సర్వే 
  •     వారంలో సర్వే పూర్తి చేస్తామంటున్న ఆఫీసర్లు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నల్లా కనెక్షన్​ లేని ఇండ్లు, కొత్తగా మంచినీటి కనెక్షన్​ ఇవ్వాల్సిన ఇండ్లు 2 లక్షలపైనే ఉన్నాయని తేలింది. రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా రెండు వారాల నుంచి మిషన్​ భగీరథపై ఉమ్మడి జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నారు. 15 అంశాలకు సంబంధించి ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్​ లో వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో ఆన్​ లైన్​ లో నమోదు కాని, ఇంటి నంబర్​ లేని కొత్త ఇండ్ల లెక్క తేలుతోంది. 

ఇలా ఖమ్మం జిల్లాలో 78 వేల ఇండ్లను ఆఫీసర్లు గుర్తించగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 1,24,000 ఇండ్లను గుర్తించారు. ఇవన్నీ గత ఐదారేళ్లలో కొత్తగా ఏర్పటైన కాలనీలు, కొత్త వెంచర్లు, గేటెడ్​ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లు అని అధికారులు చెబుతున్నారు. వీటికి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ప్రకారం కొత్త కనెక్షన్లు ఇస్తామని అంటున్నారు. 

ఖమ్మం జిల్లాలో... 

ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లోని 957 ఆవాసాల్లో 2,83,000 ఇండ్లకు మిషన్​ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నామని ఆఫీసర్లు చెబుతూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితికి, ఆఫీసర్లు చెబుతున్న వివరాలకు తేడా ఉందని గుర్తించి మిషన్​ భగీరథ సర్వే చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 2,16,000 ఇండ్లను సర్వే చేయగా ఇంకా సుమారు 70 వేల ఇండ్లను సర్వే చేయాల్సి ఉంది. 

ఈ సర్వేతో గ్రామ పంచాయతీ రికార్డుల్లో నమోదు కాని ఇండ్లు ఇప్పటి వరకు 78 వేల వరకు ఉన్నాయని గుర్తించి వాటిని ప్రత్యేకంగా నమోదు చేశారు. ఇక గతంలో ఖమ్మం రూరల్ మండలంలోని ఆరు గ్రామాలు మున్సిపల్ కార్పొరేషన్​ లో విలీనం కాగా, ఆ సమయంలో ఆ ఊర్లలో నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. రెండేండ్ల తర్వాత వాటిని మళ్లీ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పటికీ కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. వీటితో పాటు కొత్తగా ఏర్పడిన వెంచర్లు, లే అవుట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కనెక్షన్లు లేవు. ఇప్పటి వరకు జరిగిన సర్వేతో అన్ని పంచాయతీల్లో మొత్తం 3,22,000 వేల ఇండ్లున్నాయని లెక్కతేలిందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో... 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామ పంచాయతీల్లో 1,516 ఆవాసాల్లో 2,70,000 ఇండ్లున్నాయి. ఇందులో దాదాపు 1,366  హ్యాబిటేషన్లలో 2,19,156 ఇండ్లకు గాను ఇప్పటి వరకు 2,03,060 ఇండ్లలో సర్వే పూర్తి చేయగా ఇంకా 16,128 ఇండ్లలో సర్వే చేయాల్సి ఉంది. దాదాపు 1,50,000 ఇండ్లకు కనెక్షన్​ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇంటి నంబర్, పన్ను చెల్లింపు వివరాలతో నమోదు కాని ఇండ్లతో పాటు కొత్త ఇండ్లు కూడా ఉన్నాయి. 2015–16లో మిషన్​ భగీరథ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 

2011లో జనాభా లెక్కల ప్రకారం ఉన్న ఇండ్ల సంఖ్యను అప్పుడు ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో ఆ తర్వాత కుటుంబాల సంఖ్య పెరగడం, జాయింట్ ఫ్యామిలీల నుంచి కొత్త కుటుంబాలు విడిగా ఏర్పడడం, ఫామ్​ హౌజ్​ ల లాంటివి ఏర్పాటు చేసుకోవడంతో కొత్త ఇండ్ల సంఖ్య పెరిగింది. గిరిజన గూడెల్లోకి పైప్​ లైన్లు లేకపోవడం లాంటి వేర్వేరు కారణాల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని చాలా ఇండ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వలేదు.

త్వరలో సర్వే కంప్లీట్.. 

చాలా ఇళ్లకు నల్లా కనెక్షన్​ ఇచ్చినా, వాటికి నల్లా బిగించకపోవడం, కొన్ని చోట్ల నల్లాలు పాడవడం, కొన్ని చెడిపోయి వాడడం లేదని సర్వేలో బయటపడుతోంది. గ్రామాలకు పైప్​ లైన్​ చేరినా, ఇంట్రా వ్యవస్థ పూర్తి కాలేదని సర్వేలో తేలింది. పైప్​ లైన్ల నిర్మాణంలో లోపం కారణంగా చివరి ఇండ్లకు నీరు రావడం లేదని గుర్తించారు. వారం, పది రోజుల్లో సర్వే పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.