- రైతుబంధు పేరుతో..వెంచర్లు, వ్యాపార సంస్థలకు చెల్లింపు
- వ్యవసాయేతర ల్యాండ్ లెక్క తేల్చిన ఆఫీసర్లు
- యాదాద్రిలో 20,231 ఎకరాలు
- నల్గొండలో 12,040.. సూర్యాపేటలో 8,600
యాదాద్రి, నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు చేయని వ్యవసాయేతర భూముల లెక్కలు తేల్చారు. యాదాద్రి జిల్లాలో సాగు చేయకున్నా రైతుబంధు తీసుకున్న భూములు ఎక్కువగా ఉండగా, ఆ తర్వాతీ స్థానంలో నల్గొండ, సూర్యాపేట ఉన్నాయి.
రైతు భరోసాపై సర్వే..
2018 ముందస్తు ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ సర్కారు.. ఎకరానికి పంట పెట్టుబడి కింద రూ.4 వేల చొప్పున రైతుబంధు ఇస్తామని ప్రకటించింది. 2018 వానాకాలం సీజన్లో ఎకరానికి రూ.4 వేల చొప్పున వేసి, ఆ తర్వాత ఎకరానికి రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. ఈ విధంగా 2023 యాసంగి సీజన్ వరకు రైతుబంధు చెల్లించారు. 2023 చివరలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్సర్కారు.. రైతు భరోసా స్కీమ్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన భూములకు కాకుండా సాగుకు యోగ్యమైన భూములకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2023 యాసంగి సీజన్లో చెల్లించిన రైతుబంధు జాబితా ప్రకారం ఈనెల 16 నుంచి అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లతోపాటు సర్వేయర్లు రంగంలోకి దిగారు. ఈనెల 20 వరకు నిర్వహించిన సర్వేలో ఎప్పుడూ సాగుచేయని, సాగుకు ఉపయోగంలో లేని భూముల లెక్కలను తేల్చారు.
ఉమ్మడి జిల్లాలో 40,471 ఎకరాలు..
సర్వే ప్రకారం నల్గొండలో 8 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 5 లక్షల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 5,87,362 ఎకరాలకు పెట్టుబడి సాయం అందుతోంది. సర్వేలో ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 40,471 ఎకరాల్లోని వ్యాపార, వాణిజ్య సంస్థలు రైతుబంధు పొందాయని గుర్తించారు. యాదాద్రి జిల్లాలో క్రషర్లు, వెంచర్లు, రాళ్లగుట్టలు, నల్గొండలో ఫ్యాక్టరీలు, హోటళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్లలో రైస్‌మిల్లులు, మఠంపల్లిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నట్టుగా గుర్తించారు.
యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 20,231 ఎకరాలు సాగుకు యోగ్యంకాని భూములు ఉండగా, ఆ తర్వాత నల్గొండలో 12,040, సూర్యాపేటలో 8,600 ఎకరాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో సాగుకు యోగ్యంకాని భూముల వివరాలను ఆఫీసర్లు ప్రకటిస్తున్నారు. ఈ జాబితాపై గ్రామసభల్లో వచ్చిన అభ్యంతరాలను నోట్ చేసుకుంటున్నారు. వీటిని మరోసారి పరిశీలించిన తర్వాత వాటి సర్వే నంబర్లను రైతు భరోసా స్కీమ్నుంచి తొలగించనున్నారు. ఆ తర్వాతే రైతు భరోసా స్కీమ్‌లో భాగంగా ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు.
11 సీజన్లలో రూ.238 కోట్లు..
రైతుబంధు స్కీమ్ ప్రారంభించిన 2018 నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి యోగ్యం కానీ భూములకు ఈ రైతుబంధు అందినట్టుగా తెలుస్తోంది. 2018 వానాకాలం సీజన్లో మొదటిసారి ఎకరానికి రూ.4 వేల చొప్పున చెల్లించారు. ఈ లెక్కన 40,471 ఎకరాలకు రూ.16,18,84,00 అందినట్టయింది. అదే ఏడాది యాసంగి నుంచి ఎకరానికి రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించారు. ఈ లెక్కన 2023 యాసంగి వరకు 10 సీజన్లలో రూ.222 కోట్లు అందాయి. మొత్తంగా రూ.238 కోట్లు ఈ సాగులో లేని భూములకు
అందినట్టయింది.