- అదుపులోకి వచ్చిన మంటలు
లాస్ ఏంజిల్స్: కార్చిచ్చు సృష్టిస్తున్న బీభత్సంతో గత కొద్ది రోజులుగా అతలాకుతలం అవుతున్న దక్షిణ కాలిఫోర్నియా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వైల్డ్ ఫైర్ ప్రభావిత ప్రాంతాల్లో శనివారం వర్షాలు కురిశాయి. దీంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నికీలలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ ఫైటర్లు కాసింత ఉపశమనం పొందారు. దక్షిణ కాలిఫోర్నియాలో ఈ సీజన్ లో తొలిసారి వర్షం కురిసింది. వచ్చే మూడు రోజుల్లో 2.5 సెంటీమీటర్ల వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా.. వర్షాలు కురిసి మంటలు అదుపులోకి వచ్చినా కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్ లోని వేల సంఖ్యలో ఇండ్లు, వాహనాలు అగ్నికీలలకు బూడిదగా మారాయి. అలాగే, కొండ ప్రాంతాల్లో చెట్లన్నీ కాలిపోయి బూడిదకుప్పగా మారాయి. ఈ కొండ ప్రాంతాల నుంచి ప్రవహించే విషపూరిత బూడిదతో కొత్త సమస్యలు రావచ్చని, రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘ఇండ్లు, వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, ఫర్నిచర్, గృహోపకరణాలు తదితర వస్తువులు మంటల్లో కాలిపోయాయి.
వాటి నుంచి విషపూరితమైన వాయువులు వెలువడే ప్రమాదం ఉంది. కాబట్టి, స్థానికులు ప్రొటెక్టివ్ గేర్లు ధరించి ఇండ్లను శుభ్రం చేసుకోవాలి. అలాగే, కొండప్రాంతాల నుంచీ ప్రవహించే విషపూరితమైన బూడితోనూ ముప్పు పొంచి ఉంది” అని ఎక్స్ పర్ట్స్ తెలిపారు. కాగా.. మంటల్లో కాలిపోయిన వ్యర్థాలను తొలగించడంలో అధికారులు తలమునకలయ్యారు. వ్యర్థాలను సాధ్యమైనంత త్వరగా శుభ్రం చేయాలని లాస్ ఏంజిల్స్ మేయర్ కారెన్ బాస్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు.