- గోల్డెన్ అవర్‌లో 1930కి కాల్ చేసిన బాధితుడు
- అప్రమత్తమై డబ్బులు కాపాడిన కాల్ సెంటర్ టీమ్
హైదరాబాద్, వెలుగు: ఓటీపీ లేకుండా కొట్టేసిన రూ.1.90 కోట్లను సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా 1930 కాల్ సెంటర్ కాపాడింది. నాలుగు నేషనల్ బ్యాంకుల్లో రూ.1.10,70,000ను హోల్డ్ చేసి, రూ.79.3 లక్షలు రికవరీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం వెల్లడించారు. ఈ నెల 10న 1930 కాల్ సెంటర్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు కాల్ చేశాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకులోని తన అకౌంట్ నుంచి మధ్యాహ్నం 2.03 గంటల సమయంలో రూ.1.90 కోట్లు డెబిట్ అయ్యాయని తెలిపాడు.
ఎలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్స్ ఓపెన్ చేయలేదని, ఓటీపీ రాకుండానే అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయని చెప్పాడు. దీంతో1930 సిబ్బంది అప్రమత్తమయ్యారు. గోల్డెన్ అవర్‌లో డబ్బులు రికవరీ చేసేందుకు ఎస్ఐ శిరీష ఆధ్వర్యంలో విమెన్ పీసీ జీ మౌనిక, స్వప్న, వెంకటేశ్ ఆపరేషన్ ప్రారంభించారు. నేషనల్ బ్యాంకులకు చెందిన నోడల్ టీమ్స్‌ను సంప్రదించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన రూ.1.9 కోట్లను కాపాడారు. నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఆయా బ్యాంకుల్లో డబ్బులను హోల్డ్ చేశారు.