జాబ్ లేదని సూసైడ్ చేసుకున్న యువకుడికి..నాలుగేండ్లకు ఫైనల్ ఎగ్జామ్​కు కాల్​ లెటర్

కోల్​బెల్ట్, వెలుగు: జూనియర్ ​లైన్ మెన్ పోస్టు కోసం నిర్వహించే పరీక్షకు అటెండ్ కావాలంటూ అభ్యర్థి చనిపోయిన నాలుగేండ్లకు కాల్​ లెటర్​వచ్చింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. మందమర్రికి చెందిన సిద్దెంకి మొండయ్య,-- సరోజ దంపతులకు నవీన్ కుమార్, అనూష, ఆదిత్య, జీవనకుమార్ సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు మానసిక దివ్యాంగులు. మొండయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి 2011లో రిటైరయ్యారు. జీవన్​కుమార్ 2014లో ఐటీఐ పూర్తి చేశాడు. ఎన్ సీడీపీఎల్​లో  జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీ కోసం 2018లో రాత పరీక్షకు హాజరయ్యాడు. మిగులు పోస్టుల భర్తీ విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నియామక ప్రక్రియ ఆగిపోయింది. 

ఈ క్రమంలో అనారోగ్యంతో జీవన్‌‌కుమార్‌‌ అక్క ఆదిత్య (2018లో), తల్లి సరోజ (2019 లో) మరణించారు. ఆర్థిక సమస్యలు, ఉద్యోగం రాకపోవడంతో జీవన్ కుమార్ 2020 మార్చి 15న ఉరివేసుకుని చనిపోయాడు. ఇటీవల కోర్టు ఆదేశాలతో ఎన్ సీడీపీఎల్ అధికారులు మెరిట్ ప్రకారం నియామకాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా విద్యుత్​ స్తంభం ఎక్కే పరీక్షకు ఈ నెల 24న హాజరు కావాలని శనివారం జీవన్​కుమార్​కు కాల్​లెటర్​పంపించారు. 

కానీ అతను మరణించాడని తెలియడంతో పోస్ట్ మెన్ ద్వారా  ఉద్యోగ కాల్ లెటర్ ను తిరిగి వెనక్కి పంపించారు. జీవన్​కుమార్​అక్క అనూష, తండ్రి మొండయ్యలు కూడా చనిపోగా.. ఆ కుటుంబంలో పెద్ద కొడుకు నవీన్​ ఒక్కరే ఉన్నారు. అభ్యర్థి చనిపోయిన నాలుగేళ్లకు ఉద్యోగ చివరి పరీక్షకు హాజరు కావాలని కాల్ లెటర్ రావడం నవీన్ను మరోసారి వేదనకు గురిచేసింది.