సూర్యాపేట, వెలుగు: న్యూ ఇయర్ దావత్‌కు పిలిచి గొంతు కోసి హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన బుధవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం లక్ష్మి నాయక్ తండాలో జరిగింది. తండాకు చెందిన ధరావత్ వెంకన్న, లక్ష్మణ్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వీరికి గ్రామంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. వాటాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య 2017 నుంచి భూ తగదాలు నడుస్తున్నాయి.
ఈ క్రమంలో సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో 108 డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకన్న తమ్ముడు లక్ష్మణ్ కొడుకు శేషు డ్యూటీ ముగించుకొని మంగళవారం ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో వెంకన్న కొడుకు దీపక్ అతని ఫ్రెండ్స్‌తో కలిసి గ్రామ శివారులో మద్యం సేవిస్తూ ఉండగా, శేషును న్యూ ఇయర్ కేక్ కట్ చేస్తున్నామని దావత్‌కు రావాలని పిలిచారు. ఈ క్రమంలో వారితో కలిసి శేషు మద్యం తాగుతుండగా.. పొలం విషయంలో దీపక్, శేషు మధ్య గొడవ మొదలైంది.
దీంతో దీపక్ కోపంతో కేక్ కట్ చేసేందుకు తెచ్చిన కత్తితో శేషుపై దాడి చేశాడు. భయంతో శేషు గ్రామంలోకి పరుగులు తీసి, ఓ ఇంట్లో దాక్కున్నాడు. వెంటనే దీపక్ అతని తండ్రి వెంకన్న, తల్లి సుజాతను అక్కడికి పిలిచి, ఆ ముగ్గురు కలిసి శేషుపై కత్తితో మళ్లీ దాడి చేశారు. శేషు అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకోగా, నిందితులు పరారయ్యారు. చికిత్స కోసం శేషును సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. దీపక్, అతని తండ్రి వెంకన్న, తల్లి సుజాత, దీపక్ స్నేహితులు రాజేశ్, సురేశ్, ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.