ఎన్నికల ముందు ఆత్మీయ సభలని, ఆత్మగౌరవ భవనాలని సమావేశాలు ఏర్పాటు చేసి కులాల వారీగా ఓటర్లను పిలిచి విందులు, వినోదాలు చేయడం రాష్ట్రంలో ప్రతి ఎన్నికల ముందు ఓ తంతు జరుగుతున్నది. ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు దాటవేస్తూ పదేపదే వాయిదాలు వేస్తున్న పాలకులు బీసీ కులాలకు అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కుల సంఘాల నాయకులకు, పార్టీలో ఉన్న బీసీ నాయకులకు గిరాకీ బాగా ఉంటున్నది తప్పితే బీసీల సంక్షేమ లక్ష్యం నెరవేరడం లేదు. బీసీ ఓటర్ల పేరిట నాయకులే ఎవరికి దొరికినంత వాళ్లు ప్రయోజనం పొందుతున్నారు. వీళ్లంతా పార్టీకి ఓట్ల సమీకరణలో కూత పిట్టలుగా ఉపయోగపడుతున్నారు. రాష్ట్రంలో 2014, 2018 ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ అనేక కీలక వాగ్దానాలు చేసింది. ఉద్యమ సమయంలో కూడా అనేక ఆకాంక్షలు ప్రజల ముందు పెట్టింది. కానీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి 8 ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలను, ప్రజల ఆకాంక్షలు, ఆశయాలను పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. ఒకే నాయకుడు, ఒకే పార్టీ, ఒకే ప్రభుత్వం తెలంగాణ ప్రజాస్వామ్యంలో వర్ధిల్లాలని కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టిన కేసీఆర్.. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతున్నందున తన నికర నిరంకుశ పాలనకు పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఇప్పటి నుంచి ప్రజల మధ్యే ఉండి ఆత్మీయ సమావేశాలు పెట్టాలని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కఠినంగానే ఆదేశించాడు.
అధ్వానంగా విద్యా వ్యవస్థ
ప్రజా సమస్యలను ముఖ్యంగా విద్యాసంస్థలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మౌలిక సమస్యలను తెలుసుకోవాలని, యువతను వేధిస్తున్న నిరుద్యోగ సమస్య, ధరణిలో ఏర్పడ్డ గందరగోళం, ప్రభుత్వ కార్యాలయాల్లో పెరిగిపోయిన లంచగొండి వ్యవహారాలు తదితర సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆదేశించాల్సిన సీఎం ఆత్మీయ సమావేశాలు విరివిగా నిర్వహించాలని చెప్పడం ఓట్ల కోసమేనని స్పష్టమవుతున్నది. ఆత్మీయ సమావేశాలు పెట్టి, విందు, వినోదాలు కల్పిస్తే.. ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి? తండాలు, ఆదివాసి గూడెంలు మొదలు మండల కేంద్రాలు, పట్టణాల వరకు అన్ని చోట్ల సర్కారు బడులు దీనస్థితిలో ఉన్నాయి. వాటిని బాగు చేసే నాథుడే లేడు. టీచర్లు లేరు, శానిటేషన్ లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం, వివక్ష వల్ల అనేక బడుల్లో విద్యా వాతావరణం కోల్పోయి మూసివేతకు వచ్చాయి. ఇప్పటికీ పేదరికంలో మగ్గుతూ నిత్యం రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ స్థితిలో బతుకుతున్న పేద కుటుంబాలు ఈ రాష్ట్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి. వారికి కనీసం గూడు కట్టించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆత్మీయ సభల్లో చర్చిస్తే బాగుంటుంది? అనేక త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రభుత్వ విద్య నిర్లక్ష్యానికి గురవుతున్నది. నవాబు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో కూడా4000 బడులు మూసి వేసినట్లు అంచనా. ఇప్పుడు తెలంగాణ వచ్చినంక కూడా అదే దుర్గతి. సాధారణ స్టేషనరీ కొనుగోలు చేయడానికి కూడా చిల్లిగవ్వలేని బడుల పరిస్థితి టీచర్లను, హెచ్ఎంలను, తల్లిదండ్రులను కలవర పెడుతున్నది. రాష్ట్ర బడ్జెట్ రూ.2,56, 000 కోట్లకు పెరిగినా విద్యకు కేటాయింపులు(6 శాతం) తగ్గించడం, ఇచ్చిన మొత్తంలోనూ పూర్తిగా ఖర్చు పెట్టడం లేదు. పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి, వివక్షకు ఇదో తార్కాణం. ఆత్మీయ సభల్లో పేదల విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై చర్చ పెట్టాలే తప్ప.. కులాల వారీగా మీటింగ్లు పెట్టి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు?
అనేక సమస్యలతో ఇబ్బందులు
ప్రజలకు అత్యంత ఆవశ్యకరమైన వైద్యరంగం కూడా ఇదే దుస్థితిలో ఉన్నది. అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్లు లేక మందులు లేక పరీక్షలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పేద ప్రజలకు కొన్ని దవాఖానాలు నరక కూపాలుగా మారాయి. ఇదీగాక పేదల ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి చెల్లింపు, బీసీ యువకుల కార్పొరేషన్ రుణాలు, సబ్సిడీలు, రైతుల రుణమాఫీ, మహిళా సంఘాల జీరో వడ్డీ బకాయిలు, విద్యార్థుల స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజు, రీయింబర్స్మెంట్లు సహా గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులు అన్నీ పెండింగ్ లో ఉన్నాయి. మన నాయకుల ఆత్మీయ సమావేశాల్లో ఈ విషయాలన్నీ చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను చూపిస్తే.. అవి నిజమైన ఆత్మీయ సభలు అవుతాయి. లేదంటే ఈ పేద ప్రజలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మరోసారి వంచించడానికి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికి, ఓట్లు దండుకోవడానికి ఆత్మీయ సభలు పెట్టనున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అనేకసార్లు వాగ్దానం చేసి, నమ్మబలికిన సంఘ నాయకులు మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నమ్మే స్థితిలో ప్రజలు లేరని గుర్తించాలి.
ప్రజలు మేల్కోవాలి..
అనేక హామీలు ఇచ్చి, వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని ఇప్పటికే రెండు దఫాలుగా అధికారం అనుభవించిన నాయకులు.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే సరికి మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరుతో మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రజలు నేతల కుయుక్తులను గుర్తించాలి. విద్య, వైద్యం, ఉపాధి, రుణమాఫీ, ఇండ్ల పంపిణీ తదితర సమస్యలపై నిలదీయాలి. ఏమీ మాట్లాడకుండా వాళ్లు చెప్పేది విని వస్తే.. ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయి. ప్రజలు మేల్కొని ప్రశ్నించినప్పుడే నేతల్లో మార్పు వస్తుంది? సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ విషయం అన్ని వర్గాల ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే అడగాలి. ఓట్ల తర్వాత ఎవరూ కనిపించరు.
- కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్