ఏసీబీ పేరుతో ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులుకు నకిలీ ఏసీబీ బెదిరింపులు వచ్చాయి. ఏసీబీ డీఎస్పీనంటూ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పీఏకు హరికృష్ణ అనే మాయగాడు ఫోన్ చేసి బెదిరించాడు. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నామని చెప్పి.. తనని తాను ఏసీబీ డీఎస్పీ హరిగా పరిచయం చేసుకున్నాడు. తాము విధులలో భాగంగా దాడులు చేస్తూ ఉన్నఫలంగా వచ్చి చిత్తూరులో ఒక లాడ్జీలో ఉన్నామని తెలిపాడు. అనుకోకుండా వచ్చిన తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని.. భోజన ఖర్చుల కోసం ఏడు వేల రూపాయలు గూగుల్ పే చేయాలని ఎమ్మెల్యే పీఏను హరికృష్ణ కోరాడు. గూగుల్ పే చేయడం కోసం ఒక ఫొన్ నెంబరును కూడా పీఏకు పంపాడు. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే పీఏ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు గూగుల్ పే కోసం ఇచ్చిన నంబర్ ఆధారంగా పోలీసులు
హరికృష్ణను గుర్తించారు. అర్ధరాత్రి లాడ్జీపై దాడి చేసిన చిత్తూరు పోలీసులు నకిలీ ఏసీబీ అధికారి హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులకు హరికృష్ణ ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా.. రాష్ట్రంలో అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు సేకరించినట్లు కూడా తెలుస్తోంది. దీనిని బట్టి హరికృష్ణ వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
For More News..