గత నెల ఉపాధి కోసం కంబోడియా దేశానికి వెళ్లి చైనీస్ సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకున్న ఐదుగురు యువకులు సురక్షితంగా కరీంనగర్ చేరినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ఆకర్షణీయమైన ఉద్యోగాలంటూ ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి కరీంనగర్ చెందిన షబాజ్ ఖాన్, షారూఖ్ ఖాన్, సలీం అహ్మద్, హాజీబాబా, నవీద్ అబ్దుల్లు అగస్ట్ 31న కంబోడియా వెళ్లినట్లు సీపీ చెప్పారు. అక్కడికి వెళ్లాక చైనీస్ సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకున్నారని తెలిపారు.
బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి వారు సేఫ్గా కరీంనగర్ చేరుకునేలా చూశామన్నారు. ఈ ఐదుగురు యువకులు నిజంగా అక్కడి సైబర్ గ్యాంగ్ వలలో చిక్కుకున్నారా..లేక ముందే అన్నీ తెలిసి వెళ్లారా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అమాయక యువకులను ట్రాప్ చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లేవారు అన్నీ పక్కాగా చూసుకున్న తర్వాతే వెళ్లాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని సీపీ సూచించారు.