కాక స్ఫూర్తి తోనే ప్రజా సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు పెద్దపెల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. విశాఖ,కాక ట్రస్ట్ పేరుతో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక సేవలు చేశామని గుర్తుచేశారు. మంచిర్యాల జిల్లాలో INTUC ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మందమర్రి ఏరియా కాసిపేట 1 ఇంక్లైన్ లో ఆయన జెండా ఎగరవేశారు.
కాకా వెంకటస్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమ అని చెప్పారు వంశీకృష్ణ. లేబర్ నాయకుడిగా కార్మిక సమస్యలపై పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. సింగరేణి నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని తీసుకువచ్చి సంస్థను కాపాడారని గుర్తుచేశారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పుల పాలు చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని మండిపడ్డారు వంశీకృష్ణ. పదేళ్లలో ఒక్క సింగరేణి బొగ్గు బావి కూడా ఏర్పాటు చేయలేదన్నారు.
సింగరేణి సంస్థకు రావలసిన రూ.30 వేల కోట్ల బకాయిలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు వంశీకృష్ణ. సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.