
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈ నెలాఖరు నుంచి 'పాత కార్లకు నో ఫ్యూయెల్" పాలసీ అమలు కానుంది. రాష్ట్రంలోని మొత్తం 500 పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే 477 బంకుల్లో(372 పెట్రోల్ పంపులు,105 సీఎన్జీ రీఫిల్లింగ్ స్టేషన్లు) వెహికల్స్ ఏజ్ ను గుర్తించే కెమెరాలను ఏర్పాటు చేశారు. మరో 23 బంకుల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేసిన వెంటనే 'పాత కార్లకు నో ఫ్యూయెల్" పాలసీని అమలు చేయనున్నారు. వాస్తవానికి, ఈ పాలసీ ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు కావాల్సింది. కానీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవడంతో వాయిదా పడింది. ఢిల్లీలో కాలుష్యాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో అక్కడి రేఖా గుప్తా సర్కార్ ఈ ఏడాది మార్చిలో 'పాత కార్లకు నో ఫ్యూయెల్" పాలసీని ప్రకటించింది.
ఈ పాలసీ ప్రకారం.. 15 ఏండ్లకు పైబడిన పెట్రోల్ వెహికల్స్, 10 ఏండ్లకు పైబడిన డీజిల్ వాహనాలకు ఇకపై ఫ్యూయెల్ పోయరాదని ప్రభుత్వం నిర్ణయించింది. పాత బండ్లను గుర్తించడానికి ఫ్యూయెల్ ఫిల్లింగ్ స్టేషన్లలో(బంకుల్లో) ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, దాని రిజిస్ట్రేషన్ ఇయర్ ఆధారంగా వయసును గుర్తిస్తాయి. ఢిల్లో సుమారు 500 ఫ్యూయెల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా..ఇప్పటికే 477 చోట్ల వెహికల్ ఏజ్ గుర్తించే కెమెరాలను ఏర్పాటు చేసేశారు. వచ్చే 15 రోజుల్లో మిగిలిన 23 స్టేషన్లలోనూ కెమెరాలను అందుబాటులోకి తెస్తామని ఢిల్లీ పర్యావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ పాలసీ అమలైతే..
ఈ పాలసీ అమలైతే.. లక్షలాది వాహన యజమానులు ప్రభావితం కానున్నారు. 15 ఏండ్లకు పైబడిన పెట్రోల్ వెహికల్స్, 10 ఏండ్లకు పైబడిన డీజిల్ వెహికల్స్ ఓనర్స్ తమ బండ్లను ఢిల్లీ బయట అమ్మడానికి నో-ఒబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్వోసీ) పొందవలసి ఉంటుంది లేదా వాటిని స్క్రాప్ చేయవలసి ఉంటుంది. ఈ బండ్లను ఎక్కడ పార్క్ చేసిన సీజ్ చేసే అధికారం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు ఉంటుంది. అలాగే..ఢిల్లీ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ కింద.. పాత వాహనాలను స్క్రాప్ చేసే వారికి ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఈ పాలసీ పర్యావరణ రక్షణకు సానుకూల చర్యగా ఉన్నప్పటికీ..కొందరు వాహన యజమానులు దీనిని ఆర్థిక భారంగా భావిస్తున్నారు.