తూప్రాన్‌లో క్యాంపు రాజకీయాలు  .. చైర్మన్​ని గద్దె దించేందుకు ప్రయత్నాలు

తూప్రాన్‌లో క్యాంపు రాజకీయాలు  .. చైర్మన్​ని గద్దె దించేందుకు ప్రయత్నాలు
  • అసంతృప్త కౌన్సిలర్లకు గాలం వేస్తున్న కాంగ్రెస్​ లీడర్లు

తూప్రాన్, వెలుగు: గజ్వేల్ నియోజక వర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీలో క్యాంపు  రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. బీఆర్ ఎస్ మున్సిపల్ చైర్మన్ ను గద్దె దించేందుకు అదే పార్టీకి చెందిన వైస్ చైర్మన్ వర్గం ప్రయత్నాలు చేస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.  చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు వైస్ చైర్మన్ తో కలిపి10 మంది కౌన్సిలర్ల టీమ్ క్యాంప్ నకు వెళ్లింది. మరోవైపు చైర్మన్ తో పాటు 5గురు  కౌన్సిలర్లు  మరో క్యాంప్ లో ఉన్నారు. 2020లో మున్సిపల్​ పాలకవర్గం కొలువు దీరినప్పటి నుంచే చైర్మన్ బొంది రవీందర్​ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ మధ్య సఖ్యత లేదు.

వైస్​ చైర్మన్​తో పాటు  కొందరు కౌన్సిలర్లు చైర్మన్​ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. మొదట్లో ఉద్యమకారుడిని చైర్మన్ చేయాలనే ప్రతిపాదన ఉండగా మాజీ మంత్రి అండదండలతో రవీందర్ గౌడ్ కు చైర్మన్ పదవి దక్కింది. అభివృద్ధి పనుల కేటాయింపు, అధికారులను సమన్వయం చేయడంలో చైర్మన్​ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని వైస్ చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు రెండేళ్ల నుంచి మాజీ మంత్రి హరీశ్ రావుకు ఫిర్యాదు చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో చైర్మన్​, వైస్​చైర్మన్​ వర్గాల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. ఏడాది నుంచి ఇరు వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. 

ప్రభుత్వం మారినప్పటి నుంచి..

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగా,  వైస్ చైర్మన్ తో సహా తొమ్మిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ ముఖ్య నాయకుల అండదండలతో చైర్మన్​ రవీందర్​ గౌడ్​పై అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వైస్ చైర్మన్ 9 మంది కౌన్సిలర్లతో  క్యాంప్​ ఏర్పాటు చేయగా, చైర్మన్​ సైతం తన వర్గం కౌన్సిలర్లతో క్యాంప్​నకు వెళ్లారు. రెండు వర్గాలు వేర్వేరుగా 15 రోజులుగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. తూప్రాన్ మున్సిపల్ లో 16 వార్డులు  ఉండగా ఇందులో 13 మంది బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్, ఒకరు బీజేపీ  కౌన్సిలర్ ఉన్నారు.

వైస్​ చైర్మన్​ వర్గం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మెదక్​ ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు​ సహాయ సహకారాలతో చైర్మన్ రవీందర్​ గౌడ్​పై అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్​ చేస్తున్నట్టు తెలిసింది.  ఈ క్రమంలో  వైస్ చైర్మన్ వైపు  ఉన్నటువంటి నాయకులు చైర్మన్ వైపు ఉన్న కౌన్సిలర్ల అక్రమాలపై  కేసులు నమోదు చేసే ప్రయత్నం చేస్తున్నారు.  ఓ కౌన్సిలర్ నిర్మింస్తున్న ఇంటికి పర్మిషన్ లేదని అధికారులతో నోటీసులు ఇప్పించారు.  మరో కౌన్సిలర్  ఇటుక  బట్టీలకు అనుమతులు లేవని ధ్వంసం చేయించారు. మున్సిపల్ చైర్మన్ పై కూడా భూ కబ్జా కేసులు నమోదు చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 

చైర్మన్ పదవి కోసం పోటాపోటీ

ఓ వైపు  చైర్మన్ రవీందర్ గౌడ్ ను గద్దె దించే ప్రయత్నాలు చేస్తుండంతో పాటు ఆ ప్లాన్​ సక్సెస్​ అయితే చైర్మన్​ పదవి దక్కించుకునేందుకు వైస్​ చైర్మన్​ తోపాటు మరో కౌన్సిలర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే సదరు కౌన్సిలర్ క్యాంపునకు సంబంధించిన మొత్తం ఖర్చులను భరిస్తున్నట్లు సమాచారం.