- నియోజకవర్గానికి ‘నామా’ ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్
- మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్న ఆశ్రిత
ఖమ్మం, వెలుగు: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి తరఫున సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ బిడ్డ ఆశ్రిత ఖమ్మంలో ఎన్నికల ప్రచారం చేశారు. రఘురాంరెడ్డి అటు హీరో వెంకటేశ్‌కు, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా వియ్యంకుడు. వెంకటేశ్ బిడ్డ ఆశ్రిత..రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక్ రెడ్డి పెండ్లి చేసుకున్నారు. బుధవారం ఖమ్మం నగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రఘురాం రెడ్డి కోడలుగా ఆశ్రిత పాల్గొన్నారు. రఘురాం రెడ్డి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆమె చెప్పారు. మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆశ్రిత పాల్గొని, వారి కష్టాలు తెలుసుకున్నారు. ఐదేండ్లుగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు ఎంత ఖర్చు చేశారో చెప్పాలంటూ ఆశ్రిత ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, నేతలు తుంబురు దయాకర్ రెడ్డి, నరేశ్ రెడ్డి పాల్గొన్నారు.