మునుగోడులో ప్రచారాన్ని ముమ్మరం చేసిన పార్టీలు

మునుగోడు బైపోల్ ప్రచారం క్లైమాక్స్ చేరుకుంది. ప్రచారానికి ఇంకా 3 రోజులే టైం ఉండటంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మునుగోడులో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. క్యాంపెయిన్ లో స్పీడ్ పెంచిన పార్టీలు.. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఇవాళ చండూరు మండలం బంగారిగడ్డ దగ్గర బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సీఎం సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు నేతలు. సభకు భారీ స్థాయిలో జనసమీకరణను చేయాలని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. మునుగోడులో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
 
ఇక మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. స్టార్ క్యాంపెయినర్లలంతా మునుగోడులోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు. రేపు ఒకే రోజు 9 బహిరంగ సభలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఇందుకోసం 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రచారానికి చివరి రోజు  నవంబర్ 1 న అన్ని గ్రామాల్లో నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. రోడ్ షోలతో ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పీసీసీ ముఖ్యనేతలంతా క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.