జనగామ, వెలుగు : మీ కొడుకుగా జనగామలోనే ఉంట.. నియోజకవర్గానికి దండిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకుంట.. బతుకమ్మ కుంట, రంగప్ప చెరువులను మరింత తీర్చిదిద్దుత’ అని జనగామ బీఆర్‌ఎస్ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆదివారం జనగామ పట్టణంలోని 15, 17, 25, 19, 24, 22 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మూరి తన స్వార్థం కోసం పలు పార్టీలు మారారని విమర్శించారు.
తనది తరిగొప్పుల పక్కన ఉన్న షోడషపల్లి అని, తాన స్థానికేతరుడిని ఎలా అవుతానని ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీ పడాలి కానీ నీతిమాలిన రాజకీయం చేయొద్దని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ రౌడీ రాజ్యం వస్తుందన్నారు. జనగామ పరిసర ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయిస్తామని, ఫామ్ ఆయిల్, రైస్ ఇండస్ట్రీ, ఐటీ హబ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ గెలిస్తే వచ్చే నెల నుంచి రూ. 400లకే గ్యాస్ సిలిండ్ వస్తుందన్నారు. కాగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి జనగామ పెయింటర్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పెయింటర్లు బీఆర్‌ఎస్‌లో చేరారు.