బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ జలదీక్ష
కొల్లాపూర్(నాగర్‌కర్నూల్), వెలుగు: పెద్దవాగుకు వరదొస్తే మనుషులు, పశువుల ప్రాణాలకు గ్యారెంటీ ఉండడం లేదని, బ్రిడ్జి కోసం 20 ఏండ్ల కింద శిలాఫలకం వేసినా నేటికీ పనులు చేపట్టకపోవడం ఏంటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు మండిపడ్డారు. శనివారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ సమీపంలోని పెద్దవాగులో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దవాగుకు వరదొస్తే నార్లాపూర్, ముక్కిడి గుండం, గిరిజన తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కొల్లాపూర్నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన లీడర్ల చేతకానితనంతోనే ప్రజలు ఏటా ప్రాణ, ఆస్తి నష్టానికి గురికావాల్సి వస్తోందన్నారు. వాగు కారణంగా నిత్యం నాలుగైదు గ్రాఆమలకు సంబంధాలు తెగిపోతున్నా అధికార పార్టీ లీడర్లకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాగుల మీద బ్రిడ్జిలు కట్టడం చేతకాని వాళ్లు సోమశిల బ్రిడ్జి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జూపల్లి కృష్ణారావు మంత్రిగా పనిచేసినా, బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్‌నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరినా.. బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఇవ్వలేని మండిపడ్డారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం మొదలు పెట్టాలని, లేదంటే ప్రజాప్రతినిధులు, అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు.
బడి పనులు లేట్ చేయొద్దు
మాగనూర్, వెలుగు: మనఊరు–మనబడి కింద చేపట్టిన పనులను త్వరగా కంప్లీట్ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం కృష్ణా మండలం గుడేబల్లూర్, ముడుమల్, మురహార్ దొడ్డి, హిందూపూర్, కున్సీ, మాగనూర్ మండలం కొత్తపల్లిలో స్కూల్ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఫస్ట్ ఫేజ్ కింద 174 స్కూళ్లను ఎంపిక చేసి పనులు చేపట్టామన్నారు. విద్యుత్, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మాగనూర్ జడ్పీ స్పూల్‌ను సందర్శించిన టెన్త్ స్టూడెంట్లతో ముచ్చటించారు. అలాగే ప్రైమరీ స్కూల్‌లో నిర్వహిస్తున్న తొలిమెట్టు ప్రోగ్రామ్‌పై ఆరా తీశారు.
8.30 గంటల కల్లా సెంటర్‌కు చేరుకోవాలి
వనపర్తి, వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమనరీ పరీక్షలు రాయనున్న అభ్యర్థులు ఆదివారం ఉదయం 8.30 గంటల కల్లా సెంటర్లకు చేరుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎగ్జామ్ సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల ఎగ్జామ్ ఉంటుందని, ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 4,343 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. 16 సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ ఉన్నందుకు ఉదయం 8.30 కే రావాలని, 10.15 గేట్లు క్లోజ్ చేస్తామని చెప్పారు. పరీక్ష రాయబోయే అభ్యర్థులు తప్పనిసరిగా ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని, ఫోన్, వాచ్, షుస్, ఎలక్ట్రిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఈ మీటింగ్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సొంత పనులకు జీపీ ట్రాక్టర్
అచ్చంపేట, వెలుగు: గ్రామంలో పారిశుధ్య పనులకు వినియోగించాల్సిన జీపీ ట్రాక్టర్‌ను ఓ సర్పంచ్ కుటుంబం సొంత పనులకు వాడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. అచ్చంపేట మండలం ఐనూల్సర్పంచ్సోని కొడుకు చందు మూడు రోజులుగా జీపీ ట్రాక్టర్‌తో తన పొలాన్ని దున్నిస్తున్నాడు. గమనించిన కొందరు గ్రామ యువకులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఈ విషయంపై పంచాయతీ సెక్రటరీ సుమలత వివరణ కోరగా తనకు సమాచారం ఇవ్వకుండా ట్రాక్టర్‌ను పొలం పనులకు వాడుతున్నారని, పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
బ్రిడ్జి పనులు వెంటనే మొదలు పెట్టాలి
మదనాపురం, వెలుగు : మండల కేంద్రంలో రైల్వే గేట్ సమీపంలోని ఊక చెట్టు వాగుపై మంజూరైన బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని వైఎస్సార్‌టీపీ దేవరకద్ర కోఆర్డినేటర్ మందడి సరోజ్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వాగు వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ నరేందర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరళాసాగర్ వాగు పారినప్పుడల్లా కొత్తకోట, ఆత్మకూరు, చింతకుంట, మక్తల్, నారాయణపేటకు రాకపోకలు బంద్ అవుతున్నాయని వాపోయారు. వారం కింద వాగు దాటుతుండంగా బైకుతో సహా ముగ్గురు గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతకుంట, కొత్తకోట మండల అధ్యక్షులు మహేందర్, శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, తిరుపతయ్య పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసుల్లో జాప్యం వద్దు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను జాప్యం చేయవద్దని, బాధితులకు రావాల్సిన పరిహారం వెంటనే చెల్లించాలని విజిలెన్స్ , మానిటరింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీఎస్టీలపై 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన 10 హత్యలు, 12 అత్యాచార కేసులకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2016 నుంచి ఇప్పటి వరకు 304 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా.. 265 కేసులకు ఎఫ్‌ఆర్‌ఐ స్టేజీలో ఇవ్వాల్సిన పరిహారం రూ. 1.39 కోట్లు చెల్లించామని చెప్పారు. 39 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, సెకండ్ స్టేజ్ లో 223 కేసులకు చార్జిషీట్ వేయగా, 186 కేసులకు రూ. 1.61 కోట్లు పరిహారంగా ఇచ్చామన్నారు. వీటిలో 37 కేసుల చార్జిషీట్ పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈ కేసులను త్వరగా కంప్లీట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. 2020 లో వచ్చిన కొత్త ఆర్డర్ ప్రకారం మర్డర్ కేసుల్లో బాధితులకు అదనంగా ఇవ్వాల్సిన పరిహారం, మూడెకరాల భూమి, ఉపాధి, పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రతిపాదనలు పంపించాలన్నారు.జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి రాంలాల్, కొల్లాపూర్ డీఎఫ్‌వో నవీన్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్ ప్రకాశ్, ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీ సభ్యులు శివ, బాలరాజు, ధర్మరాజు పాల్గొన్నారు.
దవాఖానాను ప్రారంభించేదెప్పుడు?
జడ్చర్ల, వెలుగు: జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం పనులు పూర్తయి నెలలు గడుస్తున్న ఎందుకు ప్రారంభించడం లేదని టీపీసీసీ సెక్రటరీ, జడ్చర్ల కోఆర్డినేటర్ జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. పట్టణ శివారులోని కల్వకుర్తి–జడ్చర్ల హైవేను పక్కన నిర్మించిన ఆస్పత్రి మెట్లపై శనివారం కొబ్బరికాయలు ఉంచి, ముందున్న నాలాలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 2018లో రాష్ట్ర వైద్యారోగ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆస్పత్రి పనులు ప్రారంభించి కేవలం తొమ్మిది నెలల్లోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నాలుగేళ్లైనా అందుబాటులోకి తీసుకురాలేదని విమర్శించారు. నియోజకవర్గంలో రోడ్లు, భవనాలకు భూమి పూజలు అంటూ కొబ్బ రికాయలు కొడుతున్న ఎమ్మెల్యే... ఆస్పత్రి ఓపెనింగ్ కొబ్బరికాయ ఎప్పుడు కొడతారని ప్రశ్నించారు. ఆస్పత్రి కాంట్రాక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆస్పత్రి ముందు చెరువును తలపిస్తున్న నాలాను ఎందుకు మూసివేయడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మాజీ ఎంపీపీ నిత్యానందం, బ్లాక్ కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ అశోక్ యాదవ్, నేతలు బుచ్చయ్య, సర్ఫరాజ్ ఉన్నారు.
హాస్టళ్లను విజిట్ చేసిన జడ్జిలు
గద్వాల టౌన్, మక్తల్, మాగనూర్ వెలుగు: హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు జడ్జిలు హాస్టళ్లు, స్కూళ్లలో మిడ్ డే మీల్స్‌ను పరిశీలించారు. గద్వాల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి గంటా కవితా దేవి జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్‌ను తనిఖీ చేసి స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. ఫుడ్ క్వాలిటీ గా లేకపోవడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ మక్తల్, ఊట్కూర్, మగనూరు, కృష్ణా మండలాల్లో ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లతో పాటు కేజీబీవీలను విజిట్ చేశారు. తప్పనిసరిగా మోనూ ప్రకారం భోజనం పెట్టాలని, ఈ మేరకు సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
జోగులాంబ ఆదాయం రూ. 87 లక్షలు
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్‌కు రూ.87 లక్షల ఆదాయం వచ్చింది. శనివారం ఎండోమెంట్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రాజు పర్యవేక్షణలో 205 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించారు. అమ్మవారి హుండీ ద్వారా రూ.71,25,028- స్వామి వారి హుండీ ద్వారా రూ.15,08,352- అన్నదాన సత్రం హుండీ ద్వారా రూ.75,341.. - మొత్తం కలిపి రూ.87,08,721-ఆదాయం వచ్చింది. అలాగే 136 గ్రాముల మిశ్రమ బంగారం, 1005 గ్రాముల మిశ్రమ వెండిని భక్తులు సమర్పించుకున్నారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్, చైర్మన్ శ్రీనివాస రెడ్డి, ధర్మకర్తలు మద్దిలేటి, హరిబాబు, కుర్వ దొడ్ల రాముడు, చిన్ని కృష్ణయ్య, అర్చకులు ఆనంద్ శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, కమిషనర్ నిత్యానందం పాల్గొన్నారు.
పరంపోగు భూమికి పట్టాలివ్వాలి
లింగాల, వెలుగు: 50 ఏండ్లుగా పరంపోగు భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని క్యాంపు రాయవరంలో సర్వే నెంబర్ 83లో రైతులు సాగు చేసిన పంటలను ట్రాక్టర్‌పై వాగు దాటి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంపు రాయవరం, రాయవరం, పాత రాయవరం గ్రామాల పరిధిలోని సుమారు 400 మంది రైతులు 1,398 ఎకరాల పరంపోగు భూమిని 50 ఏండ్లుగా సాగు చేస్తున్నారన్నారు. ఇన్నేండ్లలో ఏనాడూ ఇటువైపు రాని ఫారెస్ట్ అధికారుల ఇప్పుడు తమవని చెబుతున్నారని వాపోయారు. 2018 ఎన్నికల సభలో పట్టాలిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ ఇప్పుడు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల జాయింట్ సర్వే అంటూ జాప్యం చేయడం సరికాదన్నారు. వెంటనే పట్టాలు ఇప్పించేందుకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగమ్మ, వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్, మాజీ సర్పంచ్ మల్లయ్య, నేతలు యాదయ్య, ఇందిరమ్మ, వెంకటయ్య, షఫీ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పొజిషన్ చూపండి
పాన్ గల్, వెలుగు: తమకు పట్టాలిచ్చిన భూముల్లో కబ్జా చూపించాలని పాన్ గల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతులు డిమాండ్ చేశారు. శనివారం పాన్‌గల్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామంలోని సర్వే నెంబర్ 444, 445, 446లోని 42 ఎకరాలను కొనుగోలు చేసి.. 2000 సంవత్సరంలో 32 మంది మహిళలకు 1.35 ఎకరాల చొప్పున పట్టాలు ఇచ్చిందన్నారు. కానీ, ఇప్పటివరకు పొజిషన్ చూపకపోవడంతో కొందరు వ్యక్తులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
కలాం.. సలాం
మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంను ఉమ్మడి జిల్లా ప్రజలు గుర్తు చేసుకున్నారు. శనివారం ఆయన జయంతి సందర్భంగా అధికార యంత్రాంగం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, స్టూడెంట్ సంఘాల ఆధ్వర్యంలో కలాం విగ్రహాలు, ఫొటోలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. మహబూబ్‌నగర్‌లో స్టూడెంట్లకు సైన్స్ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్‌రావు మాట్లాడుతూ రాకెట్ సైన్స్‌లో దేశాన్ని ప్రపంచంలో అత్యున్న స్థాయిలో నిలబెట్టిన ఘనత కలాంకే దక్కుతుందన్నారు. క్షిపణుల ప్రయోగంతో పాటు పోఖ్రాన్ అణు పరీక్షలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. – నెట్‌వర్క్, వెలుగు