మరణం.. మనిషిని వెంటాడుతున్న ఒక మిస్టరీ.
మరణాన్ని జయించి.. అమరుడిగా అవతరించేందుకు మానవులు సాగిస్తున్న పరిశోధనలు నేటికీ సఫలం కాలేదు.
అయినా పట్టువదలని విక్రమార్కుల్లలా శాస్త్రవేత్తలు ఈ రిసెర్చ్ ను ముందుకు తీసుకుపోతున్నారు.
ఈనేపథ్యంలో స్పెయిన్ కు చెందిన ఓవిడో యూనివర్సిటీ సైంటిస్టుల చూపు ‘ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్’ పై పడింది. ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ సైంటిఫిక్ నేమ్.. ‘ట్యూరిటోప్సిస్ ధోర్నీ’. ఇమ్మోర్టల్ అంటే.. మరణం లేనిది అని అర్ధం.
రిసెర్చ్ కోసం ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ పైనే శాస్త్రవేత్తలు దృష్టిపెట్టడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే.. దీన్ని రెండు భాగాలుగా కత్తిరించినప్పటికీ చనిపోదు. అంతేకాదు కత్తిరించిన రెండు భాగాల నుంచి కూడా మరో ప్రత్యేక జెల్లీఫిష్ పుట్టుకొస్తుంది.
ప్రకృతి ఈ జీవికి అమరత్వం ప్రసాదించింది. భూమిపై జెల్లీ ఫిష్ ఉనికి శతాబ్దాల నాటిదని చెబుతారు.
జెల్లీ ఫిష్ అమరత్వం గుట్టును తెలుసుకునే క్రమంలో సైంటిస్టులు.. ‘ట్యూరిటోప్సిస్ ధోర్నీ’, ‘ట్యూరిటోప్సిస్ రూబ్రా’ అనే రెండు జాతులకు చెందిన జెల్లీ ఫిష్ ల జన్యువులను జెనెటిక్ సీక్వెన్సింగ్ చేశారు. ఈ రెండు జెనెటిక్ సీక్వెన్సింగ్ ల ఫలితాలను తులనాత్మకంగా పోల్చి చూశారు. ‘ట్యూరిటోప్సిస్ రూబ్రా’ జాతి జెల్లీ ఫిష్ తో పోలిస్తే.. ఇమ్మోర్టల్ జెల్లీ ఫిష్ ‘ట్యూరిటోప్సిస్ ధోర్నీ’లో డీఎన్ఏ మరమ్మతుల ప్రక్రియ అత్యంత మెరుగ్గా ఉందని గుర్తించారు. ఇందులోని క్రోమోజోమ్ ల అంచుల్లో ఉండే టెలోమెర్స్ అనే డీఎన్ఏ ప్రొటీన్ సుదీర్ఘ కాలం పాటు ఏ మాత్రం సైజు తగ్గకుండా ఉంటున్నట్లు వెల్లడైంది. జెల్లీ ఫిష్, మనుషులు, జంతువులు సహా అన్ని జీవజాతుల జన్యువుల అంచుల్లోనూ టెలోమెర్స్ ఉంటాయి. శరీరంలో కణాల విభజనలో టెలోమెర్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కణాల విభజన జరిగే కొద్దీ.. టెలోమెర్స్ క్రమంగా బలహీనపడి సైజులో తగ్గిపోతూ మనిషిలో ముసలితనానికి దారితీస్తుంది. కానీ ‘ట్యూరిటోప్సిస్ ధోర్నీ’ జెల్లీ ఫిష్ లో టెలోమెర్స్ బలహీనపడటం అనే ముచ్చటే ఉండటం లేదు. ఫలితంగా వాటికి వార్ధక్యం అనే సంగతే ఎదురు కావడం లేదని సైంటిస్టులు విశ్లేషించారు. ఈ అంశాలు భవిష్యత్తులో మానవుల ఆయుర్దాయాన్ని పెంచే దిశగా జరిగే పరిశోధనలకు ఎంతో దోహపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
జెల్లీ ఫిష్ ఆసక్తికర విశేషాలు..
- జెల్లీ ఫిష్ కు ఉన్న విచిత్రమైన శరీర నిర్మాణం కారణంగా.. అది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది.
- జెల్లీ ఫిష్ లు సముద్రపు లోతులలో నివసిస్తాయి. కొన్నిసార్లు అవి నీటి ఉపరితలంపైనా కనిపిస్తాయి.
- భూమిపై జెల్లీ ఫిష్ ఉనికి శతాబ్దాల నాటిదని చెబుతారు. డైనోసార్ల కాలం నుంచి ఇవి భూమిపైనే ఉన్నాయి.
- దీని శరీరం 95 శాతం నీటితో తయారవుతుంది. ఈ గుణం కారణంగా.. ఇది ఇతర సముద్ర జంతువులకు పారదర్శకంగా కనిపిస్తుంది.
- జెల్లీ ఫిష్‌కు మెదడు లేదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందుకే వాటి చుట్టూ చిన్న చేపల సమూహం ఎప్పుడూ ఉంటుందని అంటారు. జెల్లీ ఫిష్ చుట్టూ ఉంటే సురక్షితమని చిన్న చేపలు భావిస్తాయట.
- జెల్లీ ఫిష్‌లు చూడటానికి అందంగా కనిపిస్తాయి.
- జెల్లీ ఫిష్‌ల మీసాలు మనిషి చర్మాన్ని తాకితే వెంటనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి మీసం చాలా విషపూరితమైనది.