త్యాగాల తెలంగాణలో ఒకే కుటుంబం బాగుపడింది: అమిత్ షా

త్యాగాల తెలంగాణలో ఒకే కుటుంబం బాగుపడింది: అమిత్ షా

బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఇవాళ హైదరాబాద్ శంషాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణలో ఒక కుటుంబంలోని వ్యక్తులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆయన విమర్శించారు. 16 స్థానాల్లో తమను గెలిపించాలని TRS  నేతలు కోరుతున్నారని…. ఆ సీట్లతో KCR దేశ ప్రధాని కాగలుగుతారా? అని ప్రశ్నించారు. దేశం మొత్తం మోడీ పేరే వినిపిస్తోందని…ఆయనే ప్రధాని కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పైనా విమర్శలు గుప్పించారు అమిత్ షా. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్‌ మెట్రో కోసం కేంద్రం రూ.1600 కోట్లు ఇచ్చిందని తెలిపారు. హైదరాబాద్‌కు బయో డైవర్సిటీ వంటి కేంద్ర సంస్థలను మంజూరు చేసిందని చెప్పారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం కేంద్రం కసరత్తు చేస్తోందన్న అమిత్ షా…. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఏం చేశారో కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షా.