బీజేపీ దూకుడును మమతా బెనర్జీ తట్టుకోగలరా!

దేేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో జాతీయ, విప్లవ, సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు, శాస్త్ర, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా, బ్రిటిష్ పాలకులకు చాలాకాలం రాజధానిగా కొనసాగిన ప్రాంతం పశ్చిమ బెంగాల్. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహర్షి అరవింద, లాలా లజపతిరాయ్, జగదీశ్ చంద్రబోస్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి ప్రభావవంతమైన నేతలు ఇక్కడి వారే. స్వాతంత్ర్య పోరాటం, అనేక ఉద్యమాల్లో ముందున్న బెంగాల్ స్వతంత్ర భారతంలో వెనకబడిన ప్రాంతంగా ఉండటానికి కారణం ఏమిటి? రాజకీయ హింసకు నెలవుగా మారడానికి కారణాలేంటి? పారిశ్రామిక వేత్తలు అటువైపు చూడకపోవడానికి కారణం ఎవరు? సాధారణ ఉద్యోగులు కూడా అక్కడికి రావడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు బెంగాలీలను తొలిచేస్తున్నాయి. ఒకవైపు సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో పాలన సాగిస్తున్నా.. రాజకీయ హింస మాత్రం తగ్గడం లేదు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న బీజేపీ మమతతో ఢీ అంటే ఢీ అంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బెంగాలీలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కమ్యూనిస్టులను ఎదిరించిన మమత ఒకవైపు అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం బెంగాల్ వీధుల్లో కమ్యూనిస్టులతో పోరాడినా, కేంద్రంలో వారితో సయోధ్య జరుపుతూ ఉండేవి. కాంగ్రెస్ పార్టీలోని ఈ ధోరణిపై అసహనంతో తిరుగుబాటు చేసి, బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ ఒక విధంగా కమ్యూనిస్టుల అరాచకాలపై పోరాటాలు జరిపారు. వీధి పోరాటాలతో కమ్యూనిస్టులను ఓడించి పదేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన మమత కూడా వారికి భిన్నమైన పాలన అందించలేకపోయింది. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోయింది. పైగా రాజకీయ హింస, అవినీతికి ఆమె మతపరమైన రాజకీయాలను జోడించింది. బెంగాల్లో 27.5 శాతంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు కోసం మమత మతపరమైన రాజకీయాలను జోడించి బెంగాల్ను రావణకాష్టంగా మార్చింది. సహజంగానే ఈ పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో ఒక విధమైన శూన్యతను సృష్టించాయి. హిందూ ఓట్లపై బీజేపీ దృష్టి బెంగాల్లో ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడంలో బీజేపీ విజయం సాధించింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను ప్రేక్షక పాత్రకు పరిమితం అయ్యేలా బీజేపీ చేయగలిగింది. ఐదేండ్ల వ్యవధిలో ఒక శక్తిగా ఇక్కడ బీజేపీ ఎదిగింది. రాష్ట్రంలో 70 శాతం ఉన్న హిందువులపై వ్యూహాత్మకంగా బీజేపీ దృష్టి సారించింది. మమత పాలనలో వారెలా వివక్షతకు గురవుతున్నారో తెలియచెప్పింది. దాంతో గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 40.64 శాతం ఓట్లు సంపాదించి బెంగాల్లోని మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో 18 గెలుచుకోగలిగింది. 43.69 శాతం ఓట్లు పొందిన తృణమూల్ కాంగ్రెస్ కన్నా కొంచెమే వెనకబడింది. ఈ ఫలితాలు బీజేపీలో కొత్త ఆశలు చిగురింపజేయగా.. అధికార పక్షంలో ప్రకంపనలు సృష్టించాయి. లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా నిలదొక్కుకోవడం కష్టమనే విషయం మమతకు అర్థమయ్యింది. పాలనపై దృష్టి సారించి, ప్రజల నమ్మకం పెంచుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీని ఎదుర్కోవడానికి గతంలో తాను సీపీఎంపై చేసినట్టుగా వీధి పోరాటాలకు దిగడం రాజకీయంగా ఆమెకే చేటు తెచ్చే పరిస్థితులకు దారితీస్తున్నాయి. మద్దతు కూడగడుతున్న మమత అయితే వీధి పోరాటాల్లో ఆరితేరిన మమత అంత తేలికగా ఓటమి అంగీకరిస్తుందని అనుకోలేం. ఈ సందర్భంగా ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవర్ మద్దతు కోరినట్లు కనిపిస్తున్నది. రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన పవార్ మార్గదర్శనంలో బీజేపీని కట్టడి చేయడానికి తన ఎత్తుగడలను మార్చుకునే ప్రయత్నంలో ఉన్నది. కాంగ్రెస్, సీపీఎం కలిసి పోటీ చేయడం ద్వారా మమతకు మద్దతుగా ఉన్న ముస్లిం ఓటర్లలో చీలిక వచ్చే అవకాశం ఉంది. బీహార్, మహారాష్ట్రలో వలే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ లో ఏమాత్రం చీలిక తీసుకురాగలరో చూడాలి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌, డీఎంకే అధినేత స్టాలిన్‌‌‌‌, శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌‌‌ ఠాక్రేతోపాటు కాంగ్రెస్‌‌‌‌ పాలిత రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించి భారీ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ర్యాలీ జరిపి రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని మమత ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల ముందు కూడా ఇటువంటి ర్యాలీ జరిపినా బెంగాల్ లో బీజేపీ ప్రభంజనాన్ని మమత అడ్డుకోలేకపోయింది. త్వరలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ) అమలు చేపట్టనున్నట్లు బెంగాల్ పర్యటన సందర్భంగా అమిత్ షా ప్రకటించారు. బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలో శరణార్థులుగా వచ్చిన కోటి మందికిపైగా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి పౌరసత్వం కల్పించగలిగితే బీజేపీకి పెద్ద ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంది. సీఏఏను వ్యతిరేకిస్తున్న తృణమూల్, కాంగ్రెస్, సీపీఎంలకు వారు ఓటు వేసే అవకాశం ఉండదు.బెంగాల్ లో పాగా వేయడానికి గత అర్థ శతాబ్ది కాలంలో ఏ జాతీయ పార్టీ ఇంత పట్టుదలతో, వ్యూహాత్మకంగా అడుగులు వేయలేదు. ఈ బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకుని మమత ఏ మేరకు నిలబడగలరో చూడాలి. కీలక నేతలకు కమలం గురి ఇదివరకే ముకుల్ రాయ్ వంటి కీలక నేతలు తృణమూల్ నుంచి బీజేపీలో చేరగా తాజాగా మాజీ మంత్రి, కీలక నేత సువేందు అధికారితోపాటు 11 మంది ఎమ్మెల్యేలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడం బెంగాల్ రాజకీయాల్లో కలకలానికి దారితీసింది. ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలున్న సమయంలో ఇలాంటి పరిణామం మమతకు కోలుకోలేని దెబ్బే. ఎన్నికల నాటికి చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తృణమూల్ను వీడి బీజేపీలో చేరతారని, చివరికి మమత మాత్రమే ఆ పార్టీలో మిగులుతారని అమిత్‌‌‌‌ షా చేసిన కామెంట్లు బీజేపీ దూకుడును స్పష్టం చేస్తున్నాయి. అంతకు ముందు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన సందర్భంగా ఆయనపై దాడికి ప్రయత్నం జరగడాన్ని బీజేపీ చాలా తీవ్రమైన అంశంగా తీసుకుంది. వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ఒక విధంగా మమతను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో గత లోక్ సభ ఎన్నికల్లో 125 చోట్ల బీజేపీ ఆధిక్యత సంపాదించింది. మరో 25 సీట్లపై పట్టు సాధిస్తే అధికారంలోకి రావడమే అనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అందుకే 200 సీట్లు గెలుస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. బీజేపీ బెంగాల్ లో నాయకత్వ సమస్యను ఎదుర్కొంటున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ లేరు. ప్రజల్లో, క్షేత్రస్థాయిలో గుర్తింపు పొందిన నాయకులు పెద్దగా లేరు. అందుకే ప్రజాబలం గల నాయకులకు అధికార పక్షం నుంచి ఆహ్వానం పలుకుతోంది. చివరకు సీపీఎం, కాంగ్రెస్ నుంచి కూడా బీజేపీలో చేరుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్రలో కూడా సీఎం అభ్యర్థి అంటూ ఎవరూ లేకుండా బీజేపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బెంగాల్ లో కూడా అలాంటి వ్యూహాలనే ఆశ్రయిస్తున్నది.  అభివృద్ధికి అడ్డంకిగా రాజకీయ హింస స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 70 ఏండ్లలో బెంగాల్ను మూడు పార్టీలే పాలించాయి. మొదట కాంగ్రెస్, తర్వాత సీపీఎం, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పాలన సాగించాయి. 1977 వరకు జరిగిన కాంగ్రెస్ పాలనలో మావోయిస్టుల హింసతో రాష్ట్రాభివృద్ధి స్తంభించి పోయింది. అది రాజకీయ అస్థిరతకు దారితీసింది. ఈ పరిణామాలతో 1968 నుంచి 1971 వరకు నాలుగుసార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించవలసి వచ్చింది. 1977లో సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ కూటమి అధికారంలోకి వచ్చింది. 34 ఏండ్లపాటు సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగినా సుస్థిర పాలన అందించలేక పోయింది. అడ్డుఅదుపు లేని రాజకీయ హింస అభివృద్ధికి అడ్డంకిగా మారింది. ముఖ్యమంత్రులుగా పనిచేసిన జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య ఉదారవాదులుగా ప్రపంచానికి కనిపించినా వారి పాలనలో అన్ని ప్రభుత్వ విభాగాలు పార్టీ విభాగాలుగా మారిపోయాయి. చట్టబద్ధ పాలన అంటూ లేకపోయింది. – చలసాని నరేంద్ర,సీనియర్ జర్నలిస్ట్