బీహార్‌లో నితీశ్‌ను మోడీ కాపాడగలరా?

బీహార్‌లో నితీశ్‌ను మోడీ కాపాడగలరా?

బీహార్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు నాలుగోసారి అధికారం చేపట్టకుండా నితీశ్​కుమార్​ను ఏ ఒక్కరూ ఆపలేరనే అభిప్రాయం ఉండేది. 2019 మేలో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో నితీశ్, బీజేపీ, రామ్​విలాస్​ పాశ్వాన్​ కలిసి మొత్తం 40 సీట్లకుగానూ 39 సీట్లు గెలుచుకున్నారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే వరకూ అంతా మంచిగానే నడిచింది. నితీశ్​ ఈజీగా విజయం సాధిస్తారని అంచనాలు వెలువడ్డాయి. కానీ, నెమ్మదిగా మార్పు కనిపించడం మొదలైంది. నితీశ్​కు పరిస్థితులు అనుకూలంగా లేవనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

గ్రేట్​ బిట్రన్​ ప్రధాన మంత్రి హరాల్డ్​ విల్సన్ ‘‘వారం రోజులు అనేది రాజకీయాల్లో చాలా ఎక్కువ సమయం”అని 55 ఏండ్ల క్రితం ఒక మాట చెప్పారు. ఇప్పుడు బీహార్​లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చివరి వారం రోజుల్లో బీహార్​లో నితీశ్​ గెలుపుపై సడెన్​గా సందేహాలు మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే.. నితీశ్​ ఇప్పుడు తన కూటమికి భారంగా మారారు. ప్రధాని నరేంద్రమోడీ ఒక్కరే ఇప్పుడు ఆయనను కాపాడగలరేమో.

చివరి వారంలో బీహార్​లో మార్పులు

అపొజిషన్​ లీడర్, లాలూ ప్రసాద్​ యాదవ్​ కొడుకు తేజస్వీ యాదవ్.. సభలకు ఇప్పుడు జనం పోటెత్తుతున్నారు. తేజస్వీ సభలకు జనం బాగానే వస్తారని భావించినా.. ఈ స్థాయిలో రావడాన్ని ఊహించలేదు. వస్తున్న జనం.. వారి ఉత్సాహం బీజేపీ, నితీశ్​ను ఆందోళనకు గురిచేస్తోంది.

లోక్​జనశక్తి నేత, దివంగత కేంద్ర మంత్రి రామ్​విలాస్​ పాశ్వాన్​ కొడుకు చిరాగ్​ పాశ్వాన్​ కూడా ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్​గా ఉన్నారు. అతని పార్టీ అభ్యర్థులు నితీశ్​కుమార్​ పార్టీ క్యాండిడేట్లతో 124 సీట్లలో నేరుగా తలపడుతున్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా మాత్రం చిరాగ్​ క్యాండిడేట్లను పెట్టలేదు. నితీశ్​కు వ్యతిరేకంగా పడే చాలా ఓట్లను చిరాగ్​ పాశ్వాన్​ చీల్చే అవకాశం ఉంది.

గతంలో నరేంద్రమోడీ బీహార్​లో క్యాంపెయిన్​కు వచ్చినప్పుడు నితీశ్​ నార్మల్​గా ఉండేవారు. కానీ ఈసారి ఆయన పద్ధతి పూర్తిగా మారింది. ఈ ఎన్నికల్లో మోడీ పాల్గొంటున్న ప్రతి మీటింగ్​కు నితీశ్​ తప్పనిసరిగా హాజరవుతున్నారు. దీనిని గమనిస్తుంటే నితీశ్​ ఇప్పుడు మోడీ పాపులారిటీపై డిపెండ్​ అవుతున్నారని అర్థమవుతోంది. తాజాగా వెలువడిన ప్రీపోల్​ సర్వేల్లో నితీశ్  కు 31 శాతం మంది ప్రజల మద్దతు మాత్రమే ఉందని వెల్లడైంది. ఇది నితీశ్​కు మంచి సంకేతం కాదు. ఇవన్నీ చూస్తుంటే బీహార్​ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు కోరుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ప్రస్తుతం పరిస్థితులు నితీశ్​కు అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. కానీ, ముందే అనుకున్నట్టు ‘‘ఒక వారం రాజకీయాల్లో చాలా ఎక్కువ సమయం”. ఇప్పటికీ నితీశ్​కు చాలా సమయమే ఉంది. ప్రధాని మోడీ ట్రెండ్​ మొత్తాన్ని మార్చేయొచ్చు. మరి ప్రధాని మోడీ బీహారీల్లో గుడు కట్టుకున్న కోపాన్ని తొలగించగలరా? అదొక్కటే ఇప్పుడు నితీశ్​ను కాపాడుతుంది.

ఒకవేళ నితీశ్ ఓటమిపాలైతే.. అది ప్రధాని మోడీకి కూడా ఓటమే. బీజేపీ సమస్య ఏమిటంటే.. దాదాపు 15 ఏండ్లుగా అధికారానికి దూరంగా ఉన్న లాలూ ప్రసాద్​ యాదవ్​ తిరిగి బీహార్​లో పవర్​లోకి రావడం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బీహార్​లో ఓడితే అది బీజేపీకి నైతికంగానూ దెబ్బే. ఎందుకంటే 2021 మేలో బెంగాల్, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. చివరగా.. ఈ ఎన్నికల్లో నితీశ్​ను మోడీ కాపాడగలుగుతారా? ప్రస్తుతానికైతే ఇది చాలా కష్టంగానే కనపడుతోంది.

ప్రభుత్వ వ్యతిరేకతకు కారణలేమిటి?

ముఖ్యమంత్రిగా 15 ఏండ్ల పాటు ఒక్కరే ఉన్నారంటే ప్రజల్లో వ్యతిరేకత కచ్చితంగా వస్తుంది. ఇందులో అనుమానం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్​లో అయితే ఐదేండ్లకే జనం మార్పు కోరుకుంటున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన లక్షలాది మంది వలస కూలీలు తిరిగి సొంత రాష్ట్రం చేరుకున్నారు. వీరంతా ఎన్నో కష్టాలు పడ్డారు. కొందరైతే కాలి నడకనే బీహార్​కు చేరుకోవాల్సి వచ్చింది. అయితే వారంతా తిరిగి వచ్చిన తర్వాత నితీశ్​ పెద్దగా చేసిందేమీ లేదు. లక్షలాది మంది వలస కూలీలు ఇప్పటికీ బీహార్​లోనే ఉన్నారు. వారంతా ఉపాధి కోల్పోయి కోపంతో ఉన్నారు. వలస కూలీల భవిష్యత్​ అనేది ఇప్పుడు బీహార్​ ఎన్నికల్లో ప్రధాన అంశం. దీనికి సంబంధించి నితీశ్​ దగ్గర సమాధానాలు లేవు.

నరేంద్రమోడీ ఇప్పటికీ బీహార్​లో పాపులర్. కానీ, ప్రస్తుతం బీహార్​లో ఎన్నికలు జరుగుతోంది నితీశ్​ కోసం. 2018లో చత్తీస్​గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలవ్వడం మనం చూశాం. అయితే, 6 నెలల తర్వాత జరిగిన లోక్​సభ ఎన్నికలకు వచ్చేసరికి ఈ మూడు రాష్ట్రాల ప్రజలకు బీజేపీకే పట్టం కట్టారు. అందువల్ల ఈ ఎన్నికల్లో నితీశ్​ ఓడిపోవచ్చని జనం అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వారంతా ప్రధాని మోడీపై కాకుండా నితీశ్​పైనే అసంతృప్తితో ఉన్నారు.

ఓవర్​ కాన్ఫిడెన్స్​ పెరిగిందా?

నాయకులు సుదీర్ఘకాలం ఒకే పోస్టుల్లో కొనసాగితే వారిలో ఓవర్​కాన్ఫిడెన్స్​ పెరుగుతుంది. భజనపరులు పెరిగిపోతారు. నితీశ్​కు క్లీన్​ ఇమేజ్​ ఉంది. అయితే కొన్ని విషయాల్లో ఆయన అహంకారంగా ఉంటారు. తన వైఖరిని మార్చుకునేందుకు ఇష్టపడరు. చుట్టూ ఉండే నాయకులు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు. భజనపరుల కీర్తనల్లో మునిగిపోయే నేతలు తాము కూడా మనుషులమే అనే విషయం మరిచిపోతుంటారు. నితీశ్​పై కోపం ఆ దశకు చేరుకుందో లేదా అనే విషయంపై మనం ఇప్పుడే ఒక అంచనాకు రాలేం.

షాకింగ్​ ఓటములు

2004లో అప్పటి ప్రధాని వాజ్​పేయి గెలుపుపై చాలా ధీమాగా ఉన్నారు. అందుకే ఏడాది ముందుగానే ఎన్నికలకు వెళ్లారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో సోనియా కూడా విజయంపై నమ్మకంతో ఉన్నారు. కానీ కాంగ్రెస్​ చరిత్రలోనే చూడని ఓటమిని ఆ పార్టీ మూటగట్టుకుంది. 2019లో చంద్రబాబు విజయంపై ఎంతో నమ్మకంతో ఉన్నా దారుణంగా ఓడిపోయారు. ఇలాంటి ఎన్నో షాకింగ్​ ఓటములు దేశ చరిత్రలో ఉన్నాయి.

– డాక్టర్ పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్

For More News..

దుబ్బాకలో సుజాత గెలిస్తే.. హరీశ్‌దే పెత్తనం

దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారం!

ఉల్లిగడ్డ మస్తు తింటున్నం.. ఒకప్పుడు ఏటా 2 కేజీలు తింటే.. ఇప్పుడు 14 కేజీలు