జూనియర్​ లాలూ నేర్వాల్సినవెన్నో…!

బీహార్​లో రాష్ట్రీయ జనతా దళ్​ (ఆర్జేడీ) పార్టీ నాయకత్వంలోని మహా కూటమి లోక్​సభ ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఓడిపోతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. రాష్ట్రంలోని మొత్తం 40 సీట్లలో ఒక్క స్థానాన్నే అలయెన్స్‌లోని కాంగ్రెస్​ పార్టీ గెలిచింది.  మిగతా 39 చోట్ల నెగ్గిన ఎన్డీయే అభ్యర్థులు భారీ మెజారిటీలను సొంతం చేసుకోవటం కొయిలేషన్​లోని ఐదు పార్టీల బలాబలాలను చెప్పకనే చెబుతోంది. బీహార్​లో లాలూ ప్రసాద్​ యాదవ్​ పార్టీకి ఈ పరిస్థితి రావటానికి చాలా కారణాలున్నాయి.

జూనియర్​ లాలూగా పార్టీ కార్యకర్తలు పిలుచుకునే తేజస్వీ యాదవ్​ లీడర్​షిప్​లో ఆర్జేడీ అయిష్టంగా కూటమి కట్టడం ఓటమికి దారితీసిందనే అభిప్రాయం బలంగా ఉంది. యాదవేతరులను కలుపుకుపోయే ఉద్దేశం ఆర్జేడీకి లేదని, అందుకే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.  వేరే పార్టీలతో చేతులు కలపటంతో నాన్​–యాదవ్​లు ముఖ్యంగా మోస్ట్‌ బ్యాక్‌వర్గ్‌ వర్గాలు ఆర్జేడీకి దూరమయ్యాయి. ఈ పార్టీ మళ్లీ పవర్​లోకి రావటం కష్టమనుకునే  నిర్ణయం తీసుకున్నాయి.

మరో వైపు.. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఎన్డీయేకి చేరువ కావటంతో ఆ కూటమి బలపడింది.  బీహార్​, జార్ఖండ్​లలోని ఎస్సీ, ఎస్టీ రిజర్వ్​డ్​ సెగ్మెంట్లలో ఈసారి 5 శాతం వరకు ఎక్కువ పోలింగ్​ నమోదు కావటాన్ని బట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. తమకి ఓటేయాలని బీజేపీ కోరటం వల్లే ఆయా వర్గాలు ఓటింగ్​కి భారీగా క్యూ కట్టారని చెప్పొచ్చు. ఆర్జేడీతో కొత్తగా జట్టు కట్టిన రాష్ట్రీయ లోక్​ సమతా పార్టీ (ఆర్​ఎల్​ఎస్​పీ​), వికాస్​శీల్​ ఇన్​సాన్​ పార్టీ (వీఐపీ), హిందుస్థానీ ఆవామ్‌ మోర్చా (హెచ్​ఏఎం) పార్టీలకు కింది స్థాయిలో కేడర్​ లేదు.  ఫలితంగా ఇతర పార్టీల ఓట్లను చీల్చలేకపోయాయి. పైగా ఆ మూడు పార్టీలు నిన్న మొన్నటి వరకూ బీజేపీతోనే ఉండి, ఎన్నికలకు ముందే ఆర్జేడీ వైపు వచ్చాయి.  ఇంత సడన్​గా ప్లేటు ఫిరాయించటాన్ని ఆయా పార్టీల కార్యకర్తలు, సపోర్టర్లు, న్యూట్రల్‌ ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు.

ఇదే అదునుగా బీహార్​ సీఎం నితీశ్​ కుమార్​ యాదవేతరుల్లోని ఆర్జేడీ వర్కర్లను తన వైపు తిప్పుకోగలిగారు. ప్రిన్సిపల్​ సెక్రెటరీగా చేసి పాలిటిక్స్​లోకి వచ్చిన ఆర్​సీపీ సింగ్​ కూడా ఈ విషయంలో ఆయనకు సహకరించారు. కోపరేటివ్​, బ్లాక్​, డిస్ట్రిక్ట్​ లెవల్​ ఆర్జేడీ నాయకులను ముఖ్యంగా కుశ్వాహాలను జేడీ(యూ)లోకి జంప్​ చేసేలా ఒప్పించారు. ఆర్​ఎల్​ఎస్​పీ లీడర్​, కేంద్ర మాజీ సహాయ మంత్రి ఉపేంద్ర కుశ్వాహ ఎన్డీయేకి గుడ్​ బై చెబుతున్నట్లు క్లారిటీ ఇవ్వటంతో ఆయన వర్గీయులందరినీ తన పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలను నితీశ్​ ముమ్మరం చేశారు. మల్లా–ముస్లిం తగాదాల నేపథ్యంలో.. ముఖేశ్​ సాహ్ని పార్టీ ‘వికాస్​శీల్​ ఇన్​సాన్​’ని కూటమిలోకి చేర్చుకోవటం ఆర్జేడీకి మరో మైనస్​ పాయింట్​ అయింది.

ఫ్యామిలీ గొడవలు

పెద్ద కులాలకు పది శాతం కోటాను వ్యతిరేకించటంకూడా ఆర్జేడీకి ఈ ఎన్నికల్లో నష్టం తెచ్చింది. తేజస్వీకి రాష్ట్రవ్యాప్తంగా కేడర్​తో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడలేదు. దీనికితోడు లాలూ ఫ్యామిలీ గొడవలు తరచూ బయటకు పొక్కటంతో ఆర్జేడీని జనంలో పలుచన చేసింది. ఆ కుటుంబం నుంచి మీసా భారతి, తేజస్వీ యాదవ్​, తేజ్​ ప్రతాప్ ​తెర మీదికి రావటం వల్ల లాలూ వారసత్వం కోసం ముగ్గురు పాకులాడుతున్నారన్న చెడ్డ పేరు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

ముస్లింలకు ఏదీ భరోసా

బీహార్​లో మల్లా–ముస్లింల మధ్య చాలా మత ఘర్షణలు జరిగాయి. ఆర్జేడీని యాదవుల తర్వాత ముస్లింలే ఎక్కువగా అభిమానిస్తారు. నార్త్​ బీహార్​లో మల్లాలు హిందూత్వ సంస్థ బజరంగ్​ దళ్​తో సంబంధాలు కలిగి ఉంటారు.  కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడ్డాక 2015 జనవరిలో ముజఫర్​పూర్​లోనూ, అదే ఏడాది నవంబర్​లో లాల్​గంజ్​లోనూ,  2016 ఆగస్టులో సరన్​​లోనూ మల్లాల వల్లే మత ఘర్షణలు, వయొలెన్స్​ చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.  నార్త్​ బీహార్​ రూరల్​ ప్రాంతాల్లోని పెద్ద కులాలతోపాటు ఇతర కమ్యూనిటీల్లో కూడా ఈమధ్య మల్లాల ప్రభావం పెరుగుతోంది.