- రూ.5 లక్షల జరిమానా చెల్లించండి
- ఇండస్ట్రియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో రెండెకరాల స్థలానికి సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టాదారు పేరు మార్చడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారుల సాయంతో నార్సింగ్‌లోని సర్వే నంబర్ 340/4/1లో పట్టాదారుగా ఉన్న ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును నమోదుచేసి పాస్‌బుక్ జారీచేయడం చెల్లదని పేర్కొంది.
ఇందుకు రూ.5 లక్షల జరిమానా చెల్లించాలని ఇండస్ట్రియల్ కార్పొరేషన్‌ను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నార్సింగ్‌లో 1998లో కొనుగోలు చేసిన సర్వే నంబర్ 340/4/1లోని రెండెకరాల భూమి పట్టాదారుగా తమ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో గండిపేట తహసీల్దార్ పాస్‌బుక్ జారీ చేయడాన్ని సవాలుచేస్తూ ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున శత్రుగన్ అగర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది బి.నళిన్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఈ భూమికి సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని 2014లో ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, అయినా తమకు నోటీసు ఇవ్వకుండా పిటిషనర్ పేరును తొలగించి ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ పేరును పట్టాదారుగా చేరుస్తూ తహసిల్దార్ గత ఏడాది అక్టోబరు 13న ఉత్తర్వులు జారీచేశారని తెలిపారు.
కాగా.. హైకోర్టులో వివాదం ఉన్న పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, అందువల్ల మ్యుటేషన్ చేయించుకున్నామని, పిటిషనర్‌కు నోటీసులు ఇచ్చామని ప్రతివాది ఇండస్ట్రియల్ ఆయిల్ కార్పొరేషన్ కౌంటరు దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. 2014 నాటి కోర్టు ఉత్తర్వుల ప్రకారం పిటిషనర్ పేరును పునరుద్ధరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. చట్టవిరుద్ధంగా మ్యుటేషన్ చేపట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చారు.