
కోళ్లకు అదేదో రోగం వస్తుందట.. చికెన్ తింటే అది మనకు కూడా వస్తదట! అస్సలు తినొద్దు’’...ఇలాంటి చర్చలు ప్రతి ఊరిలో జరుగుతూనే ఉన్నాయి. దాంతో చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.డాక్టర్లు మాత్రం బర్డ్ ఫ్లూ పట్ల అప్రమత్తత అవసరమే. కానీ.. అది పెద్ద మహమ్మారి ఏం కాదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.
బర్డ్ ఫ్లూ అంటే ఏంటి?
బర్డ్ ఫ్లూ.. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ (H5N1) వల్ల పక్షుల్లో వ్యాపిస్తుంది. ఇది ముందుగా బాతుల్లాంటి నీటి పక్షుల్లో పుట్టినట్టు నిపుణులు చెప్తున్నారు. అది మనుషులతో సహా ఏ జంతువుకైనా వ్యాపిస్తుంది. పక్షుల రెక్కలు, రెట్టలు, శరీర ద్రవాల ద్వారా ఇతర పక్షులకు వ్యాపిస్తుంది. పెంపుడు జంతువుల విషయానికి వస్తే.. ఈ వ్యాధి సోకితే.. బతకడం చాలా కష్టం.
జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రస్తుతం మనదగ్గర బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా లేకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. కోళ్లను పెంచే రైతులు, వాటి లాజిస్టిక్స్ సిబ్బందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ప్రత్యేకంగా బర్డ్ ఫ్లూకి ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కానీ.. సాధారణ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే కొంతవరకు అడ్డుకోవచ్చు.
బాగా ఉడికించి తినాలి
బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్‌ని ఇంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసుకుని, బాగా ఉడికించి తినాలి. చికెన్‌ని ఎక్కువ టెంపరేచర్స్‌లో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది. బయట రెస్టారెంట్లలో వండింది తినకపోవడం చాలా బెటర్. ఎందుకంటే.. వాళ్లు ఎలా వండుతున్నారో మనకు తెలియదు. పర్సనల్ హైజీన్ కూడా ముఖ్యమే. చేతితో ముక్కు, నోరు తాకేముందు కచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. ఇదేకాదు.. ఏ వైరస్ వచ్చినా చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వైరస్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండడం వల్ల కొందరు పిల్లలు దీన్ని తట్టుకోలేకపోవచ్చు. ఇక పెద్దవాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం వల్ల ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి. కానీ.. మిడిల్ ఏజ్వాళ్లు హెల్దీగా ఉండడం, అప్పటికే చాలా రకాల వైరస్‌లకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కాస్త ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతో తొందరగా కోలుకుంటారు.
- డాక్టర్ వినీత్ ఇలాపురం, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, యశోదా హాస్పిటల్