విదేశీ స్టూడెంట్లపై కెనడా ఆంక్షలు

విదేశీ స్టూడెంట్లపై కెనడా ఆంక్షలు

ఒట్టావా :  కెనడా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలసల కట్టడికి, తాత్కాలిక నివాసితుల సంఖ్య తగ్గించడానికి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్లు, వర్కర్లకు ఇచ్చే పని అనుమతులపై ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పెరుగుతున్న ఇండ్ల  కొరత, నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం ఎక్స్ ద్వారా ప్రకటించారు. " గతేడాదితో  పోలిస్తే ఈ ఏడాది స్టడీ పర్మిట్లు 35% తగ్గిస్తం. వచ్చే ఏడాది మరో 10% తగ్గిస్తం. 

మా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి వలసలు ప్రయోజనకరమే. అయినప్పటికీ, కొందరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించడానికి ఆంక్షలు విధించక తప్పడంలేదు’’ అని ట్రూడో పేర్కొన్నారు. కెనడా ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం..2023 లో 5,09,390 మంది విదేశీ విద్యార్థులకు స్టడీ పర్మిట్లు జారీ చేశారు. ఈ ఏడాది ఈ 7 నెలల్లో 1,75,920 మందికి అనుమతిచ్చారు. 

కెనడా ప్రజల మెప్పుకోసమేనా..!

కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్య గడిచిన రెండేండ్లలోనే రెట్టింపు అయ్యింది. 2022లో 14 లక్షల మంది ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 28 లక్షలకు చేరింది. వలసల కారణంగా నిరుద్యోగంతో పాటు ఇండ్ల కొరత  పెరిగిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడం, ఇటీవలి సర్వేలో ట్రూడో వెనకబడడంతో  సర్కారు అప్రమత్తమైంది. తాత్కాలిక నివాసితులను 5 శాతా నికి పరిమితం చేసేందుకు చర్యలు చేపట్టింది. కెనడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే ట్రూడో ఈ చర్యలు చేపట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మన దేశంపై ప్రభావమెంత..?

కెనడా నిర్ణయం మన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయుల సంఖ్యే ఎక్కువ. 2022లో జారీ చేసిన మొత్తం స్టడీ పర్మిట్లలో 40% భారతీయులే దక్కించుకున్నారు. గత నెల భారత ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..13.35 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుతుండగా.. ఇందులో 4.27 లక్షల మంది కెనడాలో ఉన్నారు. 2013 నుంచి 2022 మధ్య కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 260 శాతం పెరిగింది.