ఈ బ్యాట్​తో కొడితే పక్కా సిక్సరే

ఈ బ్యాట్​తో కొడితే పక్కా సిక్సరే

హ్యాపీ డేస్​ సినిమా చూశారా? ఆ సినిమాలో ‘టైసన్​’ కేరక్టర్​ గుర్తుందా? ఓహ్​.. ఎందుకు గుర్తులేదు? అంత ఈజీగా ఎట్ల మరిచిపోతం అంటరా? సరే.. ఇంకో ప్రశ్న.. ఆ సినిమాలో టైసన్​ ఓ క్రికెట్​ బ్యాట్​ తయారు చేస్తాడు గుర్తుందా! ఇట్ల బాల్​ను టచ్​ చేస్తే చాలు, బాల్​ రయ్యుమంటూ బౌండరీవైపు దూసుకెళ్లేది. ఇదిగో, సేమ్​ అట్లాంటి బ్యాట్​నే తయారు చేశారు కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్​ బ్రిటిష్​ కొలంబియా సైంటిస్టులు.

ఓ కొత్త ఆల్గారిథంతో ఆ బ్యాట్​ను చెక్కారు. దానికి ‘ఆల్గోబ్యాట్​’ అని పేరు పెట్టారు. బాల్​ను బ్యాట్​ తాకితే చాలు గాల్లో తేలుకుంటూ బౌండరీ అవతల పడిపోతుందట. మెషీన్​ లెర్నింగ్​ టెక్నిక్​ ద్వారా బ్యాట్​ పెర్ఫార్మెన్స్​ను పెంచేందుకు ఆల్గారిథంను రూపొందించారు. మామూలుగా వేగంగా వచ్చే బంతి తగలగానే బ్యాట్​ వణకడం(వైబ్రేషన్స్​రావడం) సహజం. వాటిని తగ్గించి ఆ వైబ్రేషన్స్​కు అవసరమయ్యే శక్తిని బాల్​పైకి పంపేలా చేయడమే ఈ ‘ఆల్గోబ్యాట్​’ ప్రత్యేకత. కంప్యూటర్​ సిమ్యులేషన్స్​ ద్వారా వాటిపై కొత్త ఆల్గారిథంలను ప్రయోగించి పరీక్షించారు. దాంట్లో బ్యాటు మంచి ఫలితాలను చూపించింది. ఆ ఆల్గారిథంకు తగ్గట్టు బ్యాట్​ రూపు కూడా మారుస్తారట.

ఇంగ్లిష్​, కాశ్మీర్​ విల్లోలతో తయారు చేసే బ్యాట్లకు ఈ సరికొత్త ఆల్గారిథంను అనుసంధానించొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఎలాంటి చెక్కనైనా ఈ ఆల్గారిథంతో బ్యాట్​గా మారిస్తే మంచి ఫలితాలుంటాయని చెబుతున్నారు. క్రికెటర్​ కావాలనుకునే పిల్లల కలలను తీర్చేందుకు ఈ ఆల్గోబ్యాట్​ ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు. అంతేకాదు, ఈ బ్యాటు అందరికీ అందుబాటు ధరలోనే దొరుకుతుందట. ఎంతో తెలుసా..? జస్ట్​ ₹2000 నుంచి ₹2700 మధ్య ఉంటుందట అంటే 30 నుంచి 40 డాలర్లు.