అంతా తూచ్.. మోడీకి ఏం తెలియదు: కెనడా PM జస్టిన్ ట్రూడో యూటర్న్

అంతా తూచ్.. మోడీకి ఏం తెలియదు: కెనడా PM జస్టిన్ ట్రూడో యూటర్న్

ఒట్టావా: సిక్కు వేర్పాటువాద నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కెనడా, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానాలా మారి.. ఇరు దేశాల దౌత్య సిబ్బందిని వెనక్కి పిలుపించుకునే వరకు వెళ్లింది. నిజ్జర్ హత్య విషయంలో కెనడా చేసిన ఆరోపణలపై భారత్ గుర్రుగా ఉంది. ఇదిలా ఉండగానే.. నిజ్జర్ హత్యపై కెనడా మీడియా ది గ్లోబ్, మెయిల్ సంచలన కథనాలు ప్రచురించాయి. కెనడాలో నిజ్జర్ మర్డర్ ప్లాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‎కు ముందే తెలుసని ఈ నివేదికలో పేర్కొన్నాయి.

ది గ్లోబ్, మెయిల్ కథనాలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల అంతంత మాత్రంగా ఉన్న భారత్, కెనడా దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని న్యూఢిల్లీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ది గ్లోబ్, మెయిల్ కథనాలపై జస్టిస్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం స్పందించింది. నిజ్జర్ హత్యపై ది గ్లోబ్, మెయిల్ ప్రచురించిన కథనాలు ఊహాజనితమైనవి.. తప్పుడు కథనాలు అని కెనడా ప్రభుత్వం కొట్టి పారేసింది. కెనడాలో తీవ్రమైన నేర కార్యకలాపాలకు ప్రధానమంత్రి మోడీ, జైశంకర్ లేదా దోవల్‌కు సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొనలేదు. 

ALSO READ | మోదీకి.. గయానా ‘ది ఆర్డర్ ఆఫ్​ ఎక్సలెన్స్’​ అవార్డు

దీనికి సంబంధించిన సాక్ష్యాధారాల గురించి తమకు తెలియదని పేర్కొన్నారు.  గత ఏడాది కెనడా జాతీయుడు, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చేందుకు జరిగిన కుట్ర గురించి ప్రధాని మోదీ, ఈఏఎం ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లకు ముందే తెలుసని మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా ఊహజనితమైనవి.. తప్పుడు కథనాలు అని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఖండించింది. నిత్యం భారత్‎పై విషం చిమ్మే జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తాజాగా తీసుకున్న యూ టర్న్ ప్రపంచదేశాల్లో చర్చనీయాంశంగా మారింది.