న్యూయార్క్: గత టీ20, వన్డే వరల్డ్ కప్స్‌లో సంచలనాలు సృష్టించిన ఐర్లాండ్ వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి నిరా పరచగా.. అరంగేట్రం జట్టు కెనడా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఐర్లాండ్ పని పట్టి టోర్నీలో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో కెనడా 12 రన్స్ తేడాతో గెలిచింది. టాస్ నెగ్గిన కెనడా తొలుత 20 ఓవర్లలో 137/7 స్కోరు చేసింది. నికోలస్ కిర్టన్ (35 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 49), శ్రేయస్ మొవ్వా (37) సత్తా చాటారు. ఓపెనర్లు ఆరోన్ జాన్సన్ (14), ధలివాల్ (6)తో పాటు పర్గత్ (18), దిల్‌ప్రీత్ (7) నిరాశపరచడంతో కెనడా 53/4తో కష్టాల్లో పడింది.
అయితే, ఐదో వికెట్‌కు 75 రన్స్ జోడించిన కిర్టన్, మొవ్వా మంచి స్కోరు అందించారు. క్రెయింగ్ యంగ్, మెకార్తీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఐర్లాండ్ ఓవర్లన్నీ ఆడి 125/7 స్కోరుకే పరిమితం అయింది. మార్క్ అడైర్ (34), జార్జ్ డాక్రెల్ (30 నాటౌట్) పోరాటం వృథా అయింది. ఓపెనర్లు బల్బిర్నీ (17), స్టిర్లింగ్(9), టక్కర్ (10), టెక్టర్ (7), క్యాంఫర్ (4), డెలానీ (3) ఫెయిలవడంతో 59/6తో ఐర్లాండ్ ఓటమి అంచుల్లో నిలిచింది.
డాక్రెల్, అడైర్ ఏడో వికెట్‌కు 62 రన్స్ జోడించి ఆశలు రేపారు. ఆ టీమ్‌కు అఖరి ఓవర్లో 17 రన్స్ అవసరం అవగా.. అడైర్‌ను ఔట్ చేసి 4 రన్స్ మాత్రమే ఇచ్చిన గోర్డన్ (2/16) కెనడాను గెలిపించాడు. జోర్డాన్‌తో పాటు హేలిగర్ రెండు వికెట్లు తీశాడు. కిర్టన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.