పుతిన్ ఒక రాక్షసుడు!

  • ఆ దేశ ప్రతిపక్ష నేత నావల్నీని చంపేశాడు: ట్రూడో
  • నావల్నీ మరణానికి పుతిన్ బాధ్యుడు: బైడెన్​
  • వివిధ దేశాల్లోని  రష్యన్ ఎంబసీల ఎదుట నిరసనలు

వాషింగ్టన్/ఒట్టావా: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌‌‌ను ‘‘రాక్షసుడు’’గా అభివర్ణించాడు కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆ దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ హఠాత్తుగా చనిపోయాడన్న వార్తలపై ఆయన శనివారం ఒట్టావాలో మీడియాతో మాట్లాడారు. ‘‘రష్యా ప్రజల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వారిని పుతిన్  ఎలా అణచేస్తాడో ఇది స్పష్టం చేసింది. ఆయన ఓ రాక్షసుడు”అని ట్రూడో అన్నారు. ‘‘నావల్నీ ఆ దేశంలో ప్రముఖ న్యాయవా ది, రష్యా ప్రతిపక్ష నేతల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత. అందుకే ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇప్పుడు చపోయాడంటూ ప్రకటించారు” అని తెలిపారు. రష్యాలో ఎన్నికలు జరగనున్నందునే ఈ ​ ఘటన జరిగిందన్నారు.  అమెరికా ప్రెసిడెంట్ ​బైడెన్​ కూడా నావల్నీ మరణానికి పుతినే కారణమని ఆరోపించారు. కాగా, నావల్నీని పుతినే హత్య చేయించారంటూ యూకే, జర్మనీ, టర్కీ, సెర్బియా, అర్జెంటీనా దేశాల్లోని రష్యన్ ఎంబసీల ఎదుట నిరసన ప్రదర్శనలు జరిగాయి.  

నావల్నీ నుంచి ప్రిగోజిన్ వరకు.. 

అలెక్సీ నావల్నీ నుంచి ప్రిగోజిన్ వరకు పుతిన్​ను ఎదిరించిన చాలా మంది నేతలు, అధికారులు, సామాజికవేత్తలు అనుమానాస్పద రీతిలో మరణించారు. విమాన ప్రమాదాలు, కిటికీల నుంచి పడిపోవడం, ఉరివేసుకోవడం, విషప్రయోగం వంటి కారణాలతో పలువురు చనిపోయారు.

యెవ్జెనీ ప్రిగోజిన్

ప్రిగోజిన్ వాగ్నర్ పారామిలిటరీ గ్రూప్ మాజీ అధిపతి. పుతిన్ అత్యంత విశ్వసనీయుల్లో ఒకడిగా ఉండేవాడు. ఉక్రెయిన్​తో యుద్ధం విషయంలో నిరుడు పుతిన్​తో విభేదించి.. తన సేనలతో తిరుగుబాటు చేశాడు. కొద్ది రోజుల తర్వాత విమాన ప్రమాదంలో చనిపోయారు.

బోరిస్ నెమ్సోవ్

1990లో ఉప ప్రధానిగా పనిచేసిన బోరిస్ నెమ్సోవ్ ను ఫిబ్రవరి 2015లో మాస్కోలో కాల్చి చంపేశారు. పుతిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతను చాలాసార్లు అరెస్టు అయ్యాడు. క్రిమియాను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైనిక చర్యకు నిరసనగా ర్యాలీ ఏర్పాట్లు చేస్తుండగా హత్యకు గురయ్యాడు.

బోరిస్ బెరెజోవ్​స్కీ 

బోరిస్ బెరెజోవ్​స్కీ శక్తివంతమైన రష్యన్ వ్యాపారవేత్త. పుతిన్​తో విభేదించి ఇంగ్లాండ్‌‌‌‌కు పారిపోయాడు. 2013లో యూకేలోని ఇంటి బాత్రూమ్ లో మెడకు ఉచ్చు బిగుసుకొని చనిపోయాడు.

అలెగ్జాండర్ లిట్వినెంకో

లిట్వినెంకో ఒక మాజీ రష్యన్ గూఢచారి. పుతిన్ ప్రభుత్వంలో లోపాలపై విమర్శలు చేసేవాడు. 2006లో లండన్ హోటల్ బార్‌‌‌‌లో అత్యంత రేడియోధార్మిక పదార్థం పొలోనియం-210తో విషప్రయోగం చేసి చంపేశారు. ఈ పని ఇద్దరు రష్యన్ ఏజెంట్లు చేసినట్లు చెప్తారు.

రవిల్ మగనోవ్

రష్యా టాప్​2 చమురు ఉత్పత్తి సంస్థ లుకోయిల్ బోర్డు చైర్మన్ రవిల్ మగనోవ్ ఉక్రెయిన్ యుద్ధాన్ని బహిరంగంగా విమర్శించిన ఆరు నెలల తర్వాత మరణించాడు. అతను మాస్కోలో ఓ ఆసుపత్రి కిటికీలోంచి కిందపడి చనిపోయాడు.

అన్నా పొలిత్​వోస్కీయా​

పొలిత్​వోస్కీయా​ చెచెన్యాలో రష్యా యుద్ధంపై తీవ్రమైన విమర్శలు చేసేది.  2006 అక్టోబరులో మాస్కోలోని అపార్ట్‌‌‌‌మెంట్ లో దుండగులు ఆమెను తుపాకీతో కాల్చి చంపేశారు.

సెర్గీ మాగ్నిట్ స్కీ

సెర్గీ మాగ్నిట్స్కీ ఒక ట్యాక్స్​ అడ్వైజర్​.. రష్యా ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టాడు. విచారణ లేకుండానే అతడిని నిర్బంధించారు. ఏడాది  తర్వాత విడుదల కావడానికి ముందు 2009లో జైలులో మరణించాడు. 

అలెగ్జాండర్ పెరెపిలిచ్నీ

పెరెపిలిచ్నీ విజిల్‌‌‌‌బ్లోయర్‌‌‌‌గా మారిన ఒక ఫైనాన్షియర్. 2010లో రష్యన్ ట్రెజరీ నుంచి లెక్కల్లో చూపకుండా మాయం చేసిన 230 మిలియన్ల డాలర్ల వివరాలు బయటపెట్టాడు. తర్వాత లండన్‌‌‌‌లో స్థిరపడిన అతను జాగింగ్ చేస్తూ అనుమానాస్పదంగా మరణించాడు.