న్యూఢిల్లీ: కెనడాలో హిందూ దేవాలయాలపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ ఎదుట సిక్కులు, హిందువులు ఆందోళన చేపట్టారు. హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో భారీ సంఖ్యలో సిక్కులు, హిందువులు పాల్గొన్నారు. కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారుల దాడిని ఖండిస్తూ ఈ నిరసన చేపట్టారు. కెనడాలో శాంతిభద్రతలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. నిరసనల నేపథ్యంలో చాణక్యపురిలోని కెనడా హైకమిషన్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. బారికేడ్లను పెట్టి సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.