హింసను రెచ్చగొడ్తామంటే ఊరుకోం: కెనడా మంత్రి

  • ఖలిస్తానీ మద్దతుదారులకు వార్నింగ్

ఒట్టావా: హింసను రెచ్చగొడ్తామంటే ఊరుకోబోమని కెనడా పబ్లిక్ సేప్టీ మినిస్టర్ డొమినిక్ లె బ్లాంక్ అన్నారు. ఖలిస్తానీ మద్దతుదారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లను వాంకోవర్​లో అతికించడంతో ఆయన స్పందించారు. శనివారం ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘వాంకోవర్​లో ఈ వారంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లను అతికించినట్టు  రిపోర్టులు వెలువడ్డాయి.

కెనడాలో హింసను రెచ్చగొడ్తామంటే ఊరుకోబోం” అని తెలిపారు. ఈ ఘటనపై భారత సంతతికి చెందిన చట్ట సభ్యుడు చంద్ర ఆర్య కూడా స్పందించారు. ‘‘ఇందిరా గాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లతో హిందూ–కెనడియన్లలో భయాన్ని కలిగించేందుకు వారు  ప్రయత్నిస్తున్నారు. గురు పత్వంత్ సింగ్​కు చెందిన వేర్పాటు సంస్థ సిఖ్ ఫర్ జస్టిస్.. హిందువులను భారత్​కు వెళ్లిపోమని కొన్ని నెలల క్రితం వారిపై దాడి చేసింది.

ఈ ఘటన దానికి కొనసాగింపు కిందకే వస్తుంది. ఆ పోస్టర్లలో ఇందిరా గాంధీ నుదుటిపై ఉన్న బొట్టుని బట్టి కెనడాలోని హిందువులను వారు లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలి”అని డిమాండ్ చేశారు.