- పార్టీ అధ్యక్ష పదవికీ గుడ్‌బై
- అసమ్మతి పెరగడంతో నిర్ణయం
ఒట్టావా: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికీ ఆయన రిజైన్ చేశారు. ఈమేరకు ఇటు పార్టీ బాధ్యులకు, అటు గవర్నర్ కు సమాచారం అందించానని ట్రూడో తెలిపారు. సోమవారం ఒట్టవాలోని తన అధికారిక నివాసం ముందు ట్రూడో మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు పదవిలో కొనసాగుతానని ప్రకటించారు.
ఈ ప్రాసెస్ కోసం పార్లమెంట్ ను మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. లిబరల్ పార్టీ అధ్యక్షుడిగా, కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సామర్థ్యం ఉన్న వ్యక్తి కోసం పార్టీలో చర్చిస్తామని చెప్పారు. కాగా, కెనడా చట్టాల ప్రకారం ప్రధానిని రీప్లేస్ చేయడానికి గరిష్ఠంగా 90 రోజుల సమయం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవధిలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, ట్రూడో రాజీనామాకు కారణం పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న వ్యతిరేకత, పాలనపై ప్రజల్లో అసంతృప్తి కారణమని తెలుస్తోంది. ప్రధానిగా ట్రూడో విఫలమయ్యారని అటు ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.
ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్నికలు
ఈ ఏడాది అక్టోబర్‌లో ఫెడరల్ ఎన్నికలు జరగనున్నాయి. అధికార లిబరల్ పార్టీ.. ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోరంగా ఓడిపోతుందని పలు సర్వేలు స్పష్టం చేశాయి. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్రె పొయిలీవ్రే ప్రజాభిప్రాయ సర్వేల్లో ట్రూడో కంటే చాలా ముందంజలో ఉన్నారు. దీనికితోడు ఈ నెల్లోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన్ను దీటుగా ఎదుర్కోవాలంటే ప్రజాధారణ పొందిన నేతనే ప్రధానిని చేయాలనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం.