- భారత్తో సంబంధాలపైకెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
- ట్రూడోతో దిగిన ఫొటోను షేర్ చేసిన మోదీ
బారి(ఇటలీ): కీలకమైన అంశాల్లో భారత్ తో కలిసి పని చేస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. ఇటలీలో జీ7 సమిట్ చివరి రోజు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ, ట్రూడో భేటీ అయ్యారు. అనంతరం ట్రూడో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమైన విషయాల్లో భారత్ తో కలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సున్నితమైన అంశాలకు సంబంధించిన వివరాల జోలికి పోదల్చుకోలేదని, కానీ కలిసి పని చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నామన్నారు.
భవిష్యత్తులో చాలా ముఖ్యమైన అంశాలను డీల్ చేస్తామని చెప్పారు. అలాగే శుక్రవారం ట్రూడోతో భేటీ అయిన తర్వాత ఆయనతో షేక్ హ్యాండ్ చేస్తున్న ఫొటోను ప్రధాని మోదీ ట్విట్టర్ లో షేర్ చేశారు. జీ7 సమిట్ లో కెనడా ప్రధాని ట్రూడోను కలిశాను అని క్యాప్షన్ పెట్టారు. మరోవైపు భారత్ తో సంబంధాల అంశంపై కెనడా ప్రధాని ఆఫీసు కూడా స్పందించింది. జీ7 సమిట్ లో భేటీ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారని తెలిపింది. భారత ప్రధానిగా తిరిగి ఎన్నికైన మోదీకి ట్రూడో గ్రీటింగ్స్ తెలిపారని పేర్కొంది.
కాగా, కెనడాలో పోయిన ఏడాది జూన్ లో ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయగా.. ఆయన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి.
అయితే, వచ్చే ఏడాది జీ7 సమిట్ నిర్వహణ బాధ్యతలను కెనడా స్వీకరించిన నేపథ్యంలో ఆ సమిట్ కు భారత్ ను ఆహ్వానిస్తారా? అన్న ప్రశ్నకు ట్రూడో స్పందించారు. భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమని చెప్తూనే రెండు దేశాల మధ్య సెన్సిటివ్ ఇష్యూస్ వివరాల జోలికి పోదల్చుకోలేదని చెప్పారు.