- గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువ డెత్స్
- పీఎం 2.5 తీవ్రత తక్కువ స్థాయిలో ఉన్నా డేంజరే
- గత అంచనాలకు భిన్నంగా ఇప్పటి పరిస్థితులు
- కెనడా సైంటిస్టుల తాజా స్టడీలో వెల్లడి
టొరంటో: ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 15 లక్షల మంది అదనంగా ప్రాణాలు కోల్పోతున్నారని తాజా స్టడీలో వెల్లడైంది. గతంలో పర్టిక్యులేట్ మేటర్(పీఎం) 2.5 తీవ్రత తక్కువ స్థాయిలో ఉంటే ప్రమాదకరం కాదన్న స్టడీలకు భిన్నంగా ఇప్పుడు ఇవే ప్రాణాంతకంగా మారాయని గుర్తించారు. ద జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ లో పబ్లిష్ అయిన తాజా స్టడీ ఏటా ప్రపంచవ్యాప్తంగా పీఎం 2.5 సూక్ష్మ ధూళి కణాల కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే ఉందని పేర్కొంది.
కాలుష్యంతో పెరుగుతున్న రోగాలు
ఆరుబయట పీఎం 2.5 తీవ్రత చాలా తక్కువగా ఉన్నా సరే మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రీసెర్చర్లు గుర్తించారు. గతంలో పీఎం 2.5 తీవ్రత తక్కువగా ఉంటే మరణాలు సంభవించే అవకాశాలు తక్కువని వారు భావించారు. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా పరిస్థితులు మారినట్టుగా గుర్తించారు. పీఎం 2.5 వంటి సూక్ష్మ ధూళి కణాల కారణంగా.. ఎక్కువ మంది అనేక రకాల హృదయ, శ్వాసకోశ వ్యాధులు, కేన్సర్ల బారిన పడుతున్నారని చెబుతున్నారు. ‘‘వాయు కాలుష్యంతో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది అదనంగా చనిపోతున్నారని మా స్టడీలో గుర్తించాం. తక్కువ స్థాయిలో ఉండే పీఎం 2.5 సూక్ష్మ ధూళి కణాలే దీనికి కారణం కావొచ్చని మేం భావిస్తున్నాం. పీఎం 2.5 తీవ్రత తక్కువగా ఉంటే మరణాలు సంభవించే అవకాశాలు తక్కువే అని గతంలో మేం వేసిన అంచనాలకు భిన్నంగా ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి”అని ఈ స్టడీకి నేతృత్వం వహించిన కెనడాలోని మెక్గిల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్కాట్ వీచెంతల్ స్పష్టం చేశారు.
కెనడాలో స్టడీ
25 ఏండ్ల కాలానికి సంబంధించి 7 లక్షల మంది కెనడియన్ల ఆరోగ్యం, మరణాల డేటాను కలిపి పరిశోధకులు ఈ స్టడీ చేశారు. దేశవ్యాప్తంగా పీఎం 2.5 తీవ్రత గురించిన సమాచారం కూడా సేకరించి విశ్లేషించారు. కెనడాలో పీఎం 2.5 లెవల్స్ చాలా తక్కువ స్థాయిలో నమోదవుతూ ఉంటాయి. అందువల్ల తక్కువ స్థాయి పీఎం 2.5 కారణంగా ఆరోగ్యంపై పడుతున్న ప్రభావం గురించి స్టడీ చేయడానికి ఈ దేశాన్ని ఎంచుకున్నారు. కెనడాలో గుర్తించిన సమాచారం పీఎం 2.5 స్థాయిలు ప్రాణాంతకంగా ఎలా మారుతుందో వివరించడానికి ఉపయోగపడింది. ప్రపంచ వ్యాప్తంగా గాలి కాలుష్యం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై అవగాహన తెచ్చుకోవడానికి ఈ స్టడీ పనిచేసింది.
ప్రజారోగ్యం మెరుగుదలకు దోహదం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) అంచనాల ప్రకారం.. పీఎం 2.5 సూక్ష్మ ధూళి కణాలతో కూడిన గాలి కాలుష్యం బారిన పడి ప్రతి ఏడాది 42 లక్షల మంది ముందస్తుగానే ప్రాణాలు కోల్పోతున్నారు. డబ్ల్యూహెచ్ వో ఇటీవల గాలి కాలుష్యానికి కారణమయ్యే కణాలకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ రూపొందించింది. దీనిని గతంలో చేసిన సిఫార్సులకంటే సగానికి సగం అంటే ప్రతి క్యూబిక్ మీటరుకు 10 నుంచి 5 మైక్రోగ్రాముల(యూజీ)కు తగ్గించింది. కొత్త గైడ్లైన్స్కు అనుగుణంగా ప్రపంచ ఆరోగ్య ప్రయోజనాలు గతంలో ఊహించిన దానికంటే చాలా పెద్దవిగా ఉన్నాయని వీచెంతల్ చెప్పారు. ఇకపై అతిచిన్న ధూళి కణాలను మరింత దగ్గరగా గమనించాలని, ఎందుకంటే కొన్ని దుమ్ము కణాలు ఇతర కణాల కన్నా ఎక్కువ ప్రాణాంతకమని ఆయన చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, కాలుష్య కట్టడికి సంబంధించిన డిజైర్లు రూపొందించేందుకు ఈ స్టడీ ఉపయోగడుతుందని అన్నారు.
గర్భిణులు, పుట్టబోయే బిడ్డలపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ అంతకంతకూ పెరగడంపై హెల్త్ ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం గర్భిణులు, పుట్టబోయే బిడ్డలపై ఎక్కువ పడుతుందని అంటున్నారు. నెలలు నిండకుండానే కాన్పులు, పుట్టిన పిల్లలు బరువు లేకపోవడం, పుట్టుకతోనే అనారోగ్య సమస్యలలకు కారణమవుతుందని చెప్తున్నారు. అందువల్ల గర్భిణులు, బాలింతలు సాధ్యమైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భిణులు బయటకు వెళితే ఎన్ 95 మాస్కులను వాడాలన్నారు. డబ్ల్యూహెచ్వో కూడా ఎయిర్ పొల్యూషన్ విషయంలో గర్భిణులు, 60 ఏండ్లు దాటినోళ్లు, ఐదేండ్లలోపు చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఎయిర్ క్వాలిటీ తక్కువుంటే వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఎఫెక్ట్ పడొచ్చని చెప్పింది.