హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించి అధికారం దక్కించుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. తెలంగాణలోనూ తెలుగు దేశం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. గ్రౌండ్ లెవల్లో మళ్లీ టీడీపీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇవాళ (ఆదివారం) హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీటీడీపీ నేతలతో బాబు భేటీ అయ్యారు. టీడీపీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎంపిక, సభ్యత్వ నమోదు, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ తెలుగు దేశం నేతలతో చర్చించారు. ఈ భేటీలో చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఉన్న టీటీడీపీ కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భేటీ అనంతరం బాబు మాట్లాడుతూ.. టీటీడీకి చెందిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికతో పాటు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆన్ లైన్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నేతలకు దిశానిర్ధేశం చేశారు. సభ్యత్వ నమోదుపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించామని.. అది మీ అందరి అభిమానంతోనే అది సాధ్యమైందన్నారు.
40 ఏళ్లుగా తెలుగు వారు నన్ను ఆదరించారని.. వాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పటికీ వారి కోసం పని చేస్తోందని మాటిచ్చారు. 2047లో భారత్ స్వాతంత్రం సాధించి 100 ఏళ్ల అవుతోందని.. అప్పటి వరకు ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉండాలని.. అందులో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఇకపై తెలంగాణ మీద మరింత ఫోకస్ పెడతానని.. 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని.. అందరిని కలిసి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు.