ప్లాస్మా అక్రమ రవాణా కేసులో అధికారుల చర్యలు
డోనర్ల నుంచి సేకరించిన ప్లాస్మాను అమ్ముకున్న నిందితులు
హైదరాబాద్, వెలుగు: డోనర్ల నుంచి సేకరించిన బ్లడ్, ప్లాస్మాను అమ్ముకుంటున్న శ్రీకర హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేశామని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) డీజీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఈ బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్ మూసాపేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో హీమో సర్వీస్ పేరిట నడుస్తున్న ఓ ల్యాబ్‌లో డీసీఏ అధికారులు ఈ నెల 2న తనిఖీలు చేశారు. డీసీఏ లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న ఈ ల్యాబ్ నుంచి తెలంగాణ, కర్నాటక, ఏపీలోని పలు ఫార్మా కంపెనీలు, హాస్పిటళ్లు, రీసెర్చ్ ల్యాబ్‌లకు రక్తం, ప్లాస్మాను అక్రమంగా విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
మియాపూర్ మదీనగూడలోని శ్రీకర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్‌షిఫాలోని అబిద్ అలీ ఖాన్ లయన్స్ ఐ హాస్పిటల్‌లో ఉన్న న్యూలైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ సెంటర్ వాళ్లు డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించి, ప్లాస్మాఫెరేసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి, హీమో సర్వీసెస్‌కు అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. దీంతో ఆ రెండు బ్లడ్ బ్యాంకుల్లో సోదాలు చేసి ప్లాస్మా అమ్మకాలకు సంబంధించిన ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకొని, నిర్వాహకులకు నోటీసులిచ్చారు.
విచారణలో వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఈ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేశారు. 2016 నుంచి ఈ దందా జరుగుతోందని, ఇప్పటివరకు 6 వేల యూనిట్లకు పైగా ప్లాస్మా యూనిట్లను హీమో సర్వీస్ సేకరించిందని డీసీఏ తెలిపింది. ఒక్కో యూనిట్ ప్లాస్మాను రూ.700కు కొని, రూ.3,800కు అమ్ముతున్నట్టు గుర్తించామని కమలాసన్ రెడ్డి వెల్లడించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆర్.రాఘవేంద్ర నాయక్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశామని, ఈ ముఠాతో క్రయ విక్రయాలు జరిపిన ల్యాబ్‌లు, రీసెర్చ్ సంస్థల యాజమాన్యాలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆయన తెలిపారు.