మురికి కాలువలతో క్యాన్సర్‌ ముప్పు

మురికి కాలువలతో క్యాన్సర్‌ ముప్పు

మురికి కాలువ  సమీపాన బతుకులు ఈడుస్తున్న బడుగు జీవులు అత్యంత ప్రమాదక విష రసాయనాల కారణంగా క్యాన్సర్‌ ముప్పు బారిన పడబోతున్నారని ఇటీవల ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. పరిమితులకు మించి మురికి నీటిలో ఉన్న విషపూరిత సీసం, అల్యూమినియం, ఐరన్‌ లాంటి లోహాల వల్ల క్యాన్సర్‌ సంభావ్యత అధికంగా పెరగడం సాధారణమని నివేదిక స్పష్టం చేసింది.  పేదరిక శాపంతోపాటు నదీ కాలువలు,  డ్రైనేజీ కాలువల పక్కన జీవితాలను గడుపుతున్న అభాగ్యులు పలు అనారోగ్యాలతో  అకాల మరణాల అంచున నిలబడ్డారని నివేదిక హెచ్చరికలు చేసింది.  

పరిమితులకు మించి విష రసాయనాలు

మురికి కాలువల నుంచి సేకరించిన కలుషిత నీటి నమూనాలను విశ్లేషించిన ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తల బృందం పలు ప్రమాదకర రసాయనాలు అధిక మోతాదులో ఉన్నాయని వెల్లడించింది.  దీర్ఘకాలం పాటు ఇలాంటి మురికి కాలువల  సమీపాన నివసిస్తున్న కుటుంబాల సభ్యులు వీటి విష ప్రభావ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఈ నిరుపేదలు క్యాన్సర్,  అవయవాలు దెబ్బతినడం, న్యూరోలాజికల్‌ రుగ్మతల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని అధ్యయనాల సారాంశం వివరిస్తున్నది. లెడ్‌, ఐరన్‌, అల్యూమినియం వంటి పలు లోహాలతో కలుషితమైన నీటి వల్ల శరీరంలోని డీఎన్ఏ ప్రభావితం కావడం జరుగుతోంది.  

దీనివల్ల సాధారణ కణ విధులకు భంగం కలగడం, చివరకు క్యాన్సర్ వ్యాధిగా  మారడం జరుగుతోందని వైద్య నిపుణుల ద్వారా తెలుస్తున్నది.  సీసంతో కలుషితమైన నీటిని తాగినా లేదా వాడినా.. కాలేయం, మూత్రపిండాలు, మెదడు, జీర్ణాశయం, ఎముకలు లాంటి అవయవాలు దెబ్బతింటాయని వైద్యులు వెల్లడించారు. అల్యూమినియం కలుషిత నీటివల్ల రొమ్ము గడ్డలు ఏర్పడడంతో పాటు పలు అనారోగ్యాలు కలిగే అవకాశం ఉందని వివరిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షిత నీటిని తాగడం/వాడడం, మురికి నీటికి దూరంగా ఉండడం తదితర ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.  మురికి నీటిని శుద్ధి చేయడం, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం లాంటి చర్యలు తీసుకోవడం కనీస బాధ్యత అని తెలుసుకోవాలి.  మన కుటుంబాల  ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని గమనించాలి.  మురికి కాలువలు మన జీవితాలను  అనారోగ్యంపాలు చేయకుండా జాగ్రత్తపడాలి.

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి