వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సేవలు: ప్రధాని మోడీ

వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సేవలు: ప్రధాని మోడీ

భోపాల్: వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్‌లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోడీ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 23) ప్రధాని మోడీ మధ్య ప్రదేశ్‎లో పర్యటించారు. ఈ సందర్భంగా ఛతర్ పూర్‎లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఈ సంవత్సరం బడ్జెట్‌లో క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి అనేక ప్రకటనలు చేయబడ్డాయని గుర్తు చేశారు. 

క్యాన్సర్ ఔషదాలను చౌకగా అందించాలని నిర్ణయించామని.. అలాగే రాబోయే మూడేళ్లలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పేదల కోసం క్యాన్సర్ సంస్థను నిర్మించాలనే ధీరేంద్ర శాస్త్రి తపన అభినందనీయమని మోడీ కొనియాడారు. ధీరేంద్ర శాస్త్రి చాలా కాలంగా దేశంలో ఐక్యత మంత్రం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు క్యాన్సర్ సంస్థను నిర్మించాలనే తన కొత్త చొరవతో ఆయన సమాజం, మానవత్వం కోసం కృషి చేస్తున్నారన్నారు. 

వార్డుకు ప్రధాని మోదీ తల్లి పేరు: ధీరేంద్ర శాస్త్రి 

అన్ని హంగులతో నూతనంగా నిర్మించనున్న బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌లో ఒక వార్డుకు ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ పెడతామని ధీరేంద్ర శాస్త్రి  తెలిపారు. ఈ ఆసుపత్రి 2 నుండి 3 సంవత్సరాలలోపు పూర్తవుతుందని ఆయన అంచనా వేశారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌ నిర్మాణ ఖర్చు అంచనా సుమారు రూ. 200 కోట్లు. సమాజంలోని వెనుకబడిన, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య చికిత్స అందించడం ఈ ఆసుపత్రి లక్ష్యమని తెలిపారు.